సీమకు అన్యాయం ; జగన్ కేసీఆర్ ను ఎందుకు ప్రశ్నించడు.. నోరు పడిపోయిందా : మాజీమంత్రి సోమిరెడ్డి ఫైర్
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఏపీలోని అధికార ప్రతిపక్ష పార్టీ నేతలు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. చంద్రబాబు వల్లే రాయలసీమకు అన్యాయం జరుగుతుందని, ఇప్పుడు ఈ జల వివాదాలకు అసలు కారణం చంద్రబాబేనని వైసీపీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తుంటే, టిడిపి నేతలు రాయలసీమకు చంద్రబాబు ఎంతో చేశారని, రాయలసీమకు దివంగత సీఎం వైయస్సార్, జగన్ వల్లనే అన్యాయం జరుగుతుందని ఎదురు దాడికి దిగారు.

జగన్ కు , వైఎస్సార్ కు రాజకీయ భిక్ష పెట్టింది సీమవాసులే
తాజాగా టిడిపి నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్ర సీఎం కెసిఆర్ చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తుంటే సీఎం జగన్ ఎందుకు పట్టించుకోవడం లేదంటూ ప్రశ్నించారు. జగన్ కు , వైఎస్సార్ కు రాజకీయ భిక్ష పెట్టింది సీమవాసులే అని పేర్కొన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అలాంటి సీమ వాసులను జగన్ భిక్షం ఎత్తుకునేలా చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

సీమవాసులను అడుక్కుతినేలా చెయ్యొద్దని కోరుతున్నామన్న సోమిరెడ్డి
రాయలసీమను సస్యశ్యామలం చేస్తానని ప్రకటనలు చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు సీమ ప్రాజెక్టులను తెలంగాణ రాష్ట్రం అడ్డుకుంటే ఎందుకు ప్రశ్నించడం లేదంటూ నిలదీశారు. జగన్ నోరు పడిపోయిందా అంటూ మండిపడ్డారు. సీమవాసులను అడుక్కుతినేలా చెయ్యొద్దని కోరుతున్నామని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జగన్ సర్కార్ కు విజ్ఞప్తి చేశారు. ఒక టిఎంసి నీళ్లతో 10 కోట్ల 50 లక్షల మందికి తాగునీరు అందించవచ్చని పేర్కొన్న సోమిరెడ్డి డిండి, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు లను చంద్రబాబు ఆనాడే వ్యతిరేకించారని గుర్తు చేశారు.

చంద్రబాబు రాయలసీమ కోసం ఎంతో చేశారన్న మాజీ మంత్రి
అప్పట్లో అపెక్స్ కౌన్సిల్ కి కూడా ఫిర్యాదు చేశారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉంటే జగన్ ఏం చేస్తున్నారు అంటూ ప్రశ్నించారు. రాయల సీమ ప్రజల కోసం అప్పుడు చంద్రబాబు పోరాటం సాగించారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం రాయలసీమకు అన్యాయం జరుగుతుంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications