మాజీ ఎమ్మెల్యేను కండువా కప్పి ఆహ్వానించిన చంద్రబాబు
అమరావతి: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన మాజీ శాసన సభ్యుడు ఎస్సీవీ నాయుడు.. తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో పార్టీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. ఎస్సీవీని చంద్రబాబు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శ్రీకాళహస్తి టికెట్‌ను ఆయనకే కేటాయిస్తారనే అంచనాలు ఉన్నాయి.
సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్‌లో కొనసాగారు ఎస్సీవీ నాయుడు. 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాళహస్తి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి.. ఘన విజయం సాధించారు. అప్పటి టీడీపీ అభ్యర్థి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి 13,000కు పైగా ఓట్ల తేడాతో మట్టికరిపించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే.

2009 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు గానీ ఓటమి పాలయ్యారు. బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి చేతిలో ఓటమి చవి చూశారు. ఆ తరువాత క్రియాశీలక రాజకీయాల్లో పెద్దగా కనిపించలేదు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగినప్పటికీ.. అంటీముట్టనట్టే వ్యవహరించారు. ఇక వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో- టీడీపీలో జాయిన్ అయ్యారు.
వైఎస్ఆర్సీపీలో చేరాలని మొదట భావించినప్పటికీ.. సాధ్యపడలేదు. శ్రీకాళహస్తి శాసన సభ్యుడిగా బియ్యపు మధుసూదన్ రెడ్డికే మళ్లీ కూడా టికెట్ లభించే అవకాశాలు ఉన్నాయి. నియోజకవర్గంలో చురుగ్గా పని చేస్తోన్నారాయన. ఆయనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సానుకూల అభిప్రాయమే ఉంది. వైఎస్ఆర్సీపీలో టికెట్ దక్కే అవకాశం లేకపోవడంతో టీడీపీ వైపు మొగ్గు చూపారని చెబుతున్నారు.
ఎస్సీవీ నాయుడితో పాటు ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. పార్టీ కోసం కష్టపడి పని చేస్తానని, జిల్లాలో టీడీపీని బలోపేతం చేయడానికి తనవంతు కృషి చేస్తానని వివరించారు. నియోజకవర్గం అభివృద్ది తెలుగు దేశంతోనే సాధ్యపడుతుందని వ్యాఖ్యానించారు. బొజ్జల సుధీర్‌రెడ్డికి ఈ దఫా టికెట్ దక్కకపోవచ్చని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications