అన్నా క్యాంటీన్లకు భారీ విరాళం
Chandrababu Naidu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. ఇటీవలే అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా వాటిని అందుబాటులోకి తీసుకొచ్చింది.
కృష్ణా జిల్లా గుడివాడలో ఇటీవలే చంద్రబాబు, ఆయన భార్య నారా భువనేశ్వరి తొలి క్యాంటీన్‌ను ప్రారంభించారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఏర్పాటయిన తొలి క్యాంటీన్ ఇదే. దీనికి ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది. అయిదు రూపాయల భోజనం కోసం స్థానికులు బారులు తీరి నిల్చుంటున్నారు.

తొలిదశలో రాష్ట్రవ్యాప్తంగా 100 అన్నా క్యాంటీన్లను ప్రారంభించాలంటూ చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. తమ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే దశలవారీగా రాష్ట్రంలో అన్న క్యాంటీన్లను పునరుద్ధరిస్తామంటూ ఎన్నికల సమయంలో చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హామీలను సైతం ఇచ్చిన విషయం తెలిసిందే.
వాటి పునరుద్ధరణకు సంబంధించిన ప్రతిపాదనలపై చంద్రబాబు తొలి సంతకం చేశారు కూడా. అన్నా క్యాంటీన్ల కాన్సెప్ట్‌ను తమిళనాడు తొలిసారిగా అమలు చేసింది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అయిదు రూపాయలకు ఉదయం టిఫిన్, 10 రూపాయలకు మధ్యాహ్నం, రాత్రి వేళ భోజనాన్ని అందించాలనే ఉద్దేశంతో అమ్మ క్యాంటీన్లు పేరుతో వాటిని ఏర్పాటు చేసింది అప్పట్లో.
దీన్ని 2018లో చంద్రబాబు ప్రభుత్వం ఏపీలో అమలు చేసింది. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం వల్ల అవి మూతపడ్డాయి. దీన్ని పునరుద్ధరిస్తామని తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. దీనికి అనుగుణంగా అన్నా క్యాంటీన్లు రాష్ట్రంలో ఏర్పాటు కానున్నాయి.

అన్న క్యాంటీన్ల నిర్వహణ కోసం పెద్ద ఎత్తున విరాళాలు అందుతున్నాయి. మొన్నటికి మొన్న చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి కోటి రూపాయల మొత్తాన్ని విరాళంగా అందజేశారు. ఈ మొత్తంతో కూడిన చెక్కును మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, అక్షయపాత్ర నిర్వాహకులకు అందజేశారు.
తాజాగా లోక్‌సభ మాజీ సభ్యుడు గోకరాజు గంగరాజు అన్నా క్యాంటీన్ల నిర్వహణ కోసం కోటి రూపాయల విరాళాన్ని అందించారు. ఈ మొత్తంతో కూడిన చెక్కును ఆయన మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలను తెలియజేశారు నారా లోకేష్.












Click it and Unblock the Notifications