వైసీపీలో చేరిన టీడీపీ నేత ఆర్ఆర్ఆర్‌కు అప్పుడే కీలక పదవి
YSRCP: ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన అన్నమయ్య రాయచోటి జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు రెడ్డెప్పగారి రమేష్ రెడ్డికి కీలక పదవి లభించింది. టీడీపీలో టికెట్ దక్కకపోవడం వల్ల ఆయన ఇటీవలే టీడీపీ రాజీనామా చేశారు. ఆ వెంటనే- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకొన్నారు.
అన్నమయ్య రాయచోటి జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడాయన. 2014, 2019 ఎన్నికల్లో రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. వైఎస్ఆర్సీపీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అయినప్పటికీ- క్రియాశీలకంగా వ్యవహరించారు. నియోజకవర్గంలో టీడీపీని బలోపేతం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేశారు.

ఈ ఎన్నికల్లో రమేష్ రెడ్డికి టికెట్ దక్కలేదు. రామ్‌ప్రసాద్ రెడ్డిని రాయచోటి బరిలో దింపారు టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు. గతంలో కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పని చేశారు రామ్ ప్రసాద్ రెడ్డి. ఆయనకు టికెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ పార్టీకి రాజీనామా చేశారు. వైఎస్ఆర్సీపీలో చేరారు.
ఇప్పుడాయనను పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించింది వైఎస్ఆర్సీపీ. ఈ మేరకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రెడ్డెప్పగారి రమేష్ రెడ్డిని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించినట్లు తెలిపింది.
ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున ఉమ్మడి కడప, చిత్తూరు జిల్లాలో విస్తృతంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం రాజకీయాలపై గట్టి పట్టు ఉన్న నేపథ్యంలో ఆయన సేవలను అక్కడ వినియోగించుకుంటారని పార్టీ వర్గాలు అంచనా వేస్తోన్నాయి.












Click it and Unblock the Notifications