జగన్, మంత్రులపై వ్యాఖ్యల కేసులో అయ్యన్న నిర్బంధం- కాసేపటికే..
ఏపీలో సీఎం వైఎస్ జగన్, మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో టీడీపీ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిని పోలీసులు ఇవాళ అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చిన ఆయన్ను.. ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కృష్ణాజిల్లాకు తరలించే ప్రయత్నం చేశారు. కానీ మార్గమధ్యలో 41 నోటీసులు ఇచ్చి వదిలేశారు. దీంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది.
ఇటీవల టీడీపీ నేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా గన్నవరంలో సభ నిర్వహించారు. దీనికి హాజరైన అయ్యన్నపాత్రుడు సీఎం జగన్, మంత్రులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన కృష్ణాజిల్లా పోలీసులు ఇవాళ వైజాగ్ వెళ్లి ఆయన్ను అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. అయితే అనూహ్యంగా వెనక్కి తగ్గారు.

ఉదయం ఎయిరిండియా విమానంలో హైదరాబాద్ నుంచి విశాఖ చేరుకున్న అయ్యన్నను ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అక్కడి నుంచి కృష్ణాజిల్లాకు తరలించేందుకు ప్రయత్నించారు. అయితే ఏమనుకున్నారో ఏమో యలమంచిలి వద్దకు రాగానే ఆయనకు 41ఏ నోటీసులు ఇచ్చి వదిలేశారు. దీంతో ఆయన మరో వాహనంలో ఇంటికి వెళ్లిపోయారు. గన్నవరం యువగళం సభలో ప్రసంగాలకు సంబంధించి పలువురు టీడీపీ నేతలపై కేసులు నమోదు అయ్యాయి.
గన్నవరం యువగళం సభలో స్ధానిక నేత యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా భారీగా నిర్వహించిన సభలో జగన్, మంత్రులు, ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు అయ్యన్నతో పాటు మరో నేత బుద్ధా వెంకన్నపైనా కేసు నమోదు చేశారు. అయితే ఇవాళ బుద్ధా వెంకన్నను అరెస్టు చేసేందుకు ఇంటికి వెళ్లిన పోలీసులకు ఆయన కనిపించలేదు. దీంతో వారు వెనుదిరిగారు. అయ్యన్న తరహాలోనే బుద్ధాను కూడా 41ఏ నోటీసు ఇచ్చి విచారణకు పిలిపించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications