మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు ఊరట - ఎట్టకేలకు షరతులతో బెయిల్...
వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య కేసులో నిందితుడిగా ఉన్న టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు ఎట్టకేలకు ఊరట లభించింది. ఈ కేసులో బెయిల్ కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలు చివరికి ఫలించాయి. మచిలీపట్నం కోర్టు ఆయనకు కొన్ని షరతులతో బెయిల్ మంజూరు చేసింది. దీంతో టీడీపీ శ్రేణుల్లో సంతోషం వ్యక్తమవుతోంది.
వైసీపీ నేత, మంత్రి పేర్నినాని ప్రధాన అనుచరుడు మోకా భాస్కరరావు హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. దీంతో ఈ కేసులో కొల్లు రవీంద్రకు బెయిల్ ఇవ్వొద్దంటూ పలుమార్లు కోర్టును కోరారు. దీంతో ఇప్పటికే చాలాసార్లు ఆయనకు కోర్టు బెయిల్ నిరాకరించింది.

ఎట్టకేలకు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ను మచిలీపట్నం కోర్టు మంజూరు చేసింది. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న కొల్లు రవీంద్రను బెయిల్‌పై విడుదలయ్యాక 28 రోజుల పాటు విజయవాడలోనే ఉండాలని కోర్టు షరతు పెట్టింది. పోలీసుల విచారణకు పిలిచినప్పుడు హాజరు కావాలని, ఇతర నిబంధనలు కూడా పాటించాలని సూచించింది.
మచిలీపట్నం కోర్టు బెయిల్ మేరకు రాజమండ్రి సెంట్రల్ జైల్ అధికారులు కొల్లు రవీంద్రను ఈ సాయంత్రం లేదా రేపు ఉదయం విడుదల చేయనున్నారు. బెయిల్ షరతుల మేరకు ఆయన విజయవాడ నివాసంలోనే ఉండాల్సి ఉంది.












Click it and Unblock the Notifications