జగన్ బాబాయ్ ఎక్కడ ?, ఇంత జరిగినా కూడా బయటకు రాలేదా ?
తిరుమల శ్రీవారి లడ్డులో జంతువుల కొవ్వుతో కలిపిన కల్తీ నెయ్యి ఉపయోగించారని వెలుగు చూడటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజిలెన్స్, సిట్ అధికారుల విచారణకు ఆదేశాలు జారీ చేసింది.. తనపై నమోదైన విజిలెన్స్ విచారణ నిలిపి వేయాలని టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ సీనియర్ నాయకుడు వైవీ. సుబ్బారెడ్డి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ నెయ్యి వివాదం వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. శుక్రవారం తిరుమల పర్యటన రద్దు చేసుకున్న మాజీ సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వంపై, చంద్రబాబు నాయుడుపైన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీటీడీ మాజీ చైర్మన్, తిరుపతి వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కూడా మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

అయితే జగన్ సొంత బాబాయ్, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఎక్కడా కనపడకపోవడం, తిరుమల శ్రీవారి లడ్డు కల్తి నెయ్యి వ్యవహారం వాస్తవం కాదని మీడియా ముందుకు వచ్చి ఖండించడంలో పూర్తిగా విఫలమయ్యారని వైసీపీకి చెందిన కొందరు నాయకులు విచారం వ్యక్తం చేస్తున్నారు. కనీసం జగన్ తిరుమల పర్యటన రద్దు అయిన సందర్భంగా ఆయినా టీటీడీ మాజీ చైర్మన్ వైవీ. సుబ్బారెడ్డి మీడియా ముందుకు వచ్చి ఉంటే బాగుండేదని కొందరు వైసీపీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు నాలుగు సంవత్సరాల పాటు ఆయన సొంత బాబాయ్ వైవీ. సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా వ్యవహరించారు. ఆ సందర్భంలో వైవీ. సుబ్బారెడ్డిపైన తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చినా ఆయనతోపాటు వైసీపీ నాయకులు అప్పటి ప్రతిపక్షాల ఆరోపణల ఖండిస్తూనే వచ్చారు వైవీ సుబ్బారెడ్డి తర్వాత టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన భూమన కరుణాకర్ రెడ్డి కూడా అప్పటి ప్రతిపక్షాల ఆరోపణలను ఖండిస్తూనే వచ్చారు.

అయితే తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ నెయ్యి వ్యహారంలో ఇటీవల ఒకసారి మీడియా ముందుకు వచ్చిన వైవీ సుబ్బారెడ్డి ఆతర్వాత ఎక్కడా కనపడలేదని, కల్తీ నెయ్యి వ్యవహారంలో తప్పు జరగలేదని ఆయన మీడియా ముందుకు వచ్చి ఖండించలేదని, కూటమి పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు. తిరుమల లడ్డూ వ్యవహారం వివాదాలు ముదిరిపోయిన సమయంలో వైవీ. సుబ్బారెడ్డి మీడియా ముందుకు వచ్చి వివరణ ఇవ్వాలని శ్రీవారి భక్తులు డిమాండ్ చేస్తున్నారు. అప్పటి జగన్ ప్రభుత్వంపై ఇంత పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినా ఆయన సొంత బాబాయ్ వైవీ. సుబ్బారెడ్డి ఎక్కడా కనపడకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.












Click it and Unblock the Notifications