జగన్ ప్రభుత్వ ఘన కార్యాన్ని అసెంబ్లీలో వివరించిన పవన్ కల్యాణ్
Pawan Kalyan: వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో పంచాయతీ రాజ్ విభాగంలో భారీగా నిధుల మళ్లింపు చోటు చేసుకుందని, ఆ శాఖను పర్యవేక్షిస్తోన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఆ నిధులు ఏమయ్యాయనే విషయంపై విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని సభలో అన్నారు.
అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు పవన్ కల్యాణ్ సమాధానాలను ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడం, మౌలిక సదుపాయాలను కల్పించాలనే ఉద్దేశంతో 14, 15వ ఆర్థిక సంఘం సుమారు 9,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను గత ప్రభుత్వానికి మంజూరు చేసిందని అన్నారు.

ఈ నిధులను గత ప్రభుత్వం మళ్లించిందని వివరించారు. కేంద్ర ఆర్థిక కమిషన్ గ్రాంట్‌గా మంజూరు చేసిన ఈ నిధుల్లో భారీగా మళ్లింపు చోటు చేసుకుందని పవన్ కల్యాణ్.. సభ దృష్టికి తీసుకొచ్చారు. ఫైనాన్స్ కమిషన్ 9,000 కోట్ల రూపాయలను మంజూరు చేసినప్పటికీ.. ఇందులో 998 కోట్ల రూపాయల మొత్తం ఇప్పటికీ విడుదల కాలేదని వివరించారు.
కేంద్ర ప్రభుత్వ అధికారులు గతంలో రాష్ట్రంలో అయిదు గ్రామ పంచాయతీలను సందర్శించిన సందర్భంగా ఈ విషయం వెలుగులోకి వచ్చిందని పవన్ తెలిపారు. నిధుల మళ్లింపుపై 2023 అక్టోబర్ 23వ తేదీన కేంద్రం.. అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాసిందని ఆయన గుర్తు చేశారు. ఈ నిధులను మళ్లించడం వల్ల గత ప్రభుత్వ హయాంలో గ్రామీణాభివృద్ధి కుంటుపడిందని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications