ఏపీలో గ్యాస్ కొరతపై మంత్రి నాదెండ్ల మనోహర్ క్లారిటీ
ప్రస్తుతం దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత పైన చర్చ జరుగుతున్న వేళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్యాస్ కొరత పైన పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. రాష్ట్ర గ్యాస్ సరఫరాపై ఎలాంటి ఇబ్బందులు లేవని, ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఆయిల్ కంపెనీలు, ఉన్నతాధికారులు, జిల్లా జాయింట్ కలెక్టర్లతో సమీక్ష నిర్వహించిన మంత్రి నాదెండ్ల మనోహర్ వినియోగదారులు అపోహలకు తావు ఇవ్వద్దు అన్నారు.
గ్యాస్ విషయంలో ఎటువంటి కొరత లేదు: మంత్రి నాదెండ్ల మనోహర్
గ్యాస్ వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గ్యాస్ నిల్వలు ఉన్నాయని, సరఫరా, డెలివరీ వ్యవస్థ సక్రమంగా కొనసాగుతున్నాయని అధికారులు మంత్రి నాదెండ్ల మనోహర్ కు తెలియజేశారు. ముఖ్యంగా గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ విషయంలో ఎటువంటి కొరత లేదని పేర్కొన్నారు. జిల్లాలవారీగా గ్యాస్ నిల్వలతో పాటు, సరఫరా పరిస్థితుల పైన నిరంతరం అవగాహన కల్పించి తద్వారా అపోహలను తొలగించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

అత్యవసర సేవలకు కూడా ఎట్టి పరిస్థితులలోనూ అంతరాయం కలగొద్దు
గృహ వినియోగానికి మాత్రమే కాక, పాఠశాలలు, ఆసుపత్రులు, వసతిగృహాలు వంటి అత్యవసర సేవలకు కూడా ఎట్టి పరిస్థితులలోనూ అంతరాయం కలగకూడదని మంత్రి అధికారులకు సూచించారు.జిల్లాల వారీగా ప్రాధాన్యత క్రమాన్ని బట్టి, అవసరాన్ని బట్టి సరఫరా ప్రణాళికను సర్దుబాటు చేయాలని సూచించారు. గృహ అవసరాల కోసం కేటాయించిన గ్యాస్ సిలిండర్లను, వాణిజ్య అవసరాల కోసం వినియోగించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
బ్లాక్ మార్కెట్ నివారణ కోసం ప్రత్యేక నిఘా బృందాలు
బ్లాక్ మార్కెట్ ను అరికట్టడం కోసం ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వారి పైన కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ప్రస్తుత పరిస్థితులలో ఎక్కడైనా అనుమానాస్పద లావాదేవీలు కనిపిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. గ్యాస్ వినియోగం పైన ప్రజలలో చైతన్యం పెంచాలని, సరైన అవగాహన కల్పించడం ద్వారా సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అభిప్రాయపడ్డారు.
పారదర్శకంగా, అప్రమత్తంగా గ్యాస్ విషయంలో ఉండాలన్న అధికారులు
పారదర్శకత, బాధ్యతాయుతమైన వ్యవహార శైలి ద్వారానే ప్రజల విశ్వాసం నిలబడుతుందని ఆయన తెలిపారు. అధికారులు, ఆయిల్ కంపెనీలు సమన్వయంతో పనిచేస్తే ఎటువంటి సంక్షోభం అయినా సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు అన్నారు. పారదర్శకంగా, అప్రమత్తంగా గ్యాస్ విషయంలో ఉండాలని అధికారులకు సూచించారు మంత్రి నాదెండ్ల మనోహర్.












Click it and Unblock the Notifications