వైసీపీకి గుడ్‌బై? టీడీపీ వైపు అడుగులు?? ఆ ఎమ్మెల్యేకు పార్టీతో పెరుగుతున్న అంతరం!!
అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా భారీ మెజారిటీతో విజయం సాధిస్తోంది. ప్రజల్లో తనకు తిరుగులేదని సాధించే మెజారిటీద్వారా నిరూపిస్తోంది. ఈసారి ఎన్నికల్లో కూడా వైసీపీ అధికారంలోకి రావడం తథ్యమని ముఖ్యమంత్రితోసహా పార్టీ నేతలంతా భావిస్తున్నారు. కానీ ఆ ఎమ్మెల్యేకు మాత్రం నమ్మకం ఉన్నట్లు కనపడటంలేదని, అందుకే పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా డుమ్మా కొడుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. భవిష్యత్తులో ఆయన తెలుగుదేశం పార్టీవైపు అడుగులు వేసే అవకాశాలున్నాయని విశ్లేషిస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గిద్దలూరు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో అన్నా రాంబాబు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలో చేరి టికెట్ తెచ్చుకున్న అన్నా రాంబాబు నందమూరి బాలకృష్ణతో సన్నిహితంగా మెలుగుతుంటారు. పులివెందులలో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తర్వాత అంతటి భారీ మెజారిటీని ఆయన సాధించారు (81,035). రెండోసారి మంత్రివర్గంలో మంత్రి పదవి దక్కుతుందని భావించగా నిరాశే ఎదురైంది. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమానికి దూరంగా ఎమ్మెల్యే అన్నా
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొనడంలేదు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నేను కూడా స్వయంగా పాల్గొంటున్నాను.. మీరు కూడా పాల్గొనండి అన్నా ఎటువంటి స్పందన లేదు. ఈ కార్యక్రమంలో పాల్గొనకుండా ఉండటానికి ముఖ్యమంత్రి జగన్ ఎవరికీ మినహాయింపు ఇవ్వలేదు. నియోజకవర్గంలోనే ఉన్న అన్నా రాంబాబు ఇతరత్రా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారుకానీ గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో మాత్రం పాల్గొనడంలేదు.

పార్టీ కార్యక్రమాలకు దూరంగా..
జగన్ ముఖ్యమంత్రి అయి మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మే 30వ తేదీన గిద్దలూరులో వైసీపీ ఆధ్వర్యంలో భారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి కూడా ఎమ్మెల్యే డుమ్మా కొట్టారు. కానీ అదేరోజు సాయంత్రం స్థానికంగా ఒక ఆలయంలో జరిగిన కార్యక్రమానికి మాత్రం హాజరయ్యారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ తర్వాత అంత మెజారిటీ తనకొక్కడికే ఇచ్చారని, ప్రభుత్వంలో ప్రాధాన్యం ఇవ్వడంకానీ, పార్టీలో ప్రాధాన్యం ఇవ్వడంకానీ జగన్ దగ్గరే తేల్చుకుంటాని అని తన అనుచరులతో అంటున్నారుకానీ అందుకు కూడా ఆయన ఆసక్తి చూపించడంలేదంటున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి వలస వచ్చిన అన్నారాంబాబు తిరిగి తెలుగుదేశంవైపే చూస్తున్నారని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు, ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉన్న అన్నా రాంబాబు.. నియోజకవర్గంలో ప్రజలంతా తనవైపే ఉన్నారన్న ధీమాతో ఉన్నారని స్థానిక వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. వైసీపీలోనే కొనసాగుతారా? లేదంటే తెలుగుదేశం పార్టీలోకి తిరిగి వెళతారా? అనేది తేలాలంటే కొద్దిరోజులు వేచిచూడక తప్పదు మరి..!!












Click it and Unblock the Notifications