దేవుడు ఎప్పుడో శిక్షించాడు.. అయినా మారలేదు-చంద్రబాబుపై భూమన షాకింగ్..!
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డూ ప్రసాదం తయారీపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. అప్పట్లో నెయ్యికి బదులు జంతువుల నూనెలతో ప్రసాదం తయారు చేయించారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంలో టీటీడీ ఛైర్మన్ గా పనిచేసిన భూమన కరుణాకర్ రెడ్డి ఇవాళ తీవ్రంగా స్పందించారు. చంద్రబాబుుపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు.
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దివ్యక్షేత్రం తిరుమల ప్రసాదాలపై సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలు అత్యంత దుర్మార్గమని, రాజకీయ లబ్ధికోసం, రాజకీయ స్వార్థకోసం భగవంతుడ్ని వాడుకునే వారిని భగవంతుడు క్షమించడని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. శ్రీవేంకటేశ్వర స్వామి దుష్టశిక్షణ చేస్తాడని స్వయంగా చంద్రబాబే పలుమార్లు చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

కాబట్టి ఇలాంటి నీచమైన ఆరోపణలు చేసిన వ్యక్తిని భగవంతుడు చూస్తూ ఊరుకోడన్నారు. రాజకీయ ప్రత్యర్థులను దృష్టిలో ఉంచుకుని భగవంతుడి పేరుమీద ఆరోపణలు చేయడం చంద్రబాబుకు కొత్తేమీ కాదని, గతంలో వైయస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబు ఇలాంటి ఆరోపణలు చేసిన సందర్భాలున్నాయని గుర్తుచేశారు.దీనికి అప్పుడు భగవంతుడు శిక్ష కూడా విధించాడన్నారు. అయినా చంద్రబాబు మారలేదన్నారు. ఇప్పుడు మళ్లీ అలాంటి ఆరోపణలే చేస్తున్నాడన్నారు.
తిరుమలలో అన్నప్రసాదాలు తయారు చేసే విషయంలో అధికారులకు ఎలాంటి ప్రమేయం ఉండదనేది అసలు వాస్తవమని భూమన తెలిపారు. పవిత్రమైన శ్రీ వైష్ణవుల అమృత హస్తాల మీదుగా ఈ పదార్థాలు తయారవుతాయని, ప్రసాదాల్లో పదార్థాల వినియోగం వారి చేతులమీదుగా ఉంటుందన్నారు. అలాంటి వారి హస్తాలమీదుగా తయారయ్యే ప్రసాదాలమీద చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నాడంటే..ఆయన బురదరాజకీయాలకు పరాకాష్ట అన్నారు.ఈ దఫా అధికారంలోకి వచ్చింది మొదలు తిరుమల వేదికగా చంద్రబాబు చేసిన విషప్రచారాలు అన్నీ ఇన్నీకావన్నారు. చివరకు ఏమీ దొరక్కపోవడంతో ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడంటూ భూమన మండిపడ్డారు.












Click it and Unblock the Notifications