Kesineni Nani: వైఎస్ జగన్ గ్యాంగ్ నుంచి విశాఖను ఆ దేవుడే కాపాడాలి: కేశినేని నాని: దేశద్రోహులతో..!
విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, విజయవాడ లోక్ సభ సభ్యుడు కేశినేని నాని.. మరోసారి అలాంటి కామెంట్స్ చేశారు. వైఎస్ జగన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఆయన దేశద్రోహులతో పోల్చారు. పాకిస్తాన్ నుంచి విశాఖపట్నాన్ని కాపాడాటానికి మనదేశ సైనికదళం ఉందని, వైఎస్ జగన్, ఆయన గ్యాంగ్ నుంచి కాపాడాటానికి దేవుడే ఉన్నాడని అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ట్వీట్ చేశారు.
నౌకాదళానికి చెందిన ఏడుమంది సిబ్బందిని విశాఖపట్నం పోలీసులు అరెస్టు చేసిన ఉదంతాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. హనీ ట్రాప్ లో చిక్కుకున్న ఏడుమంది నౌకాదళ సిబ్బంది.. తీర ప్రాంత భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్తాన్ కు చేరవేసిన ఘటన తెలిసిందే. ఆ ఏడుమంది నౌకాదళ సిబ్బందిని విశాఖపట్నం పోలీసులు అరెస్టు చేశారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఈ సంఘటనను ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను విమర్శించడానికి వినియోగించుకున్నారు. విశాఖపట్నాన్ని కాపాడటానికి మనదేశ సైనిక దళం ఉందని, అదే విశాఖను వైఎస్ జగన్, ఆయన గ్యాంగ్, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కాపాడటానికి ఎవరు ఉన్నారని ప్రశ్నించారు. ఆ దేవుడే కాపాడాలని వ్యాఖ్యానించారు. విశాఖపట్నం శివార్లలో వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్ద ఎత్తున భూములను కబ్జా చేశారంటూ వార్తలు వస్తోన్న నేపథ్యంలో.. కేశినేని నాని ఈ కామెంట్స్ చేశారు.
పాకిస్థాన్ నుండి విశాఖను రక్షించేందుకు భారత దేశ సైన్యం వుంది కాని విశాఖకు అసలు ముప్పు ప్రస్తుతం మన జగన్నన అండ్ గ్యాంగ్ @ysjagan @YSRCParty వీళ్ళ నుండి విశాఖను దేవుడే రక్షించాలి. pic.twitter.com/kIZRGpqiu8
— Kesineni Nani (@kesineni_nani) December 23, 2019
విశాఖపట్నాన్ని పరిపాలనాపరమైన రాజధానిగా బదలాయించడాన్ని తెలుగుదేశం చెందిన కొంతమంది ఉత్తరాంధ్ర నాయకులు స్వాగతిస్తున్నప్పటికీ.. పార్టీ పెద్దలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా మార్చడంపై ఎవరూ నోరు మెదప వద్దని పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించినప్పటికీ.. కేశినేని నాని వంటి కొందరు సీనియర్లు ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. దీనివల్ల ఉత్తరాంధ్రలో పార్టీపై వ్యతిరేకత ఎదురవుతుందనే అభిప్రాయం క్యాడర్ లో వ్యక్తమౌతోంది.












Click it and Unblock the Notifications