ఏపీకి సూపర్ న్యూస్ : బళ్ళారి గుంతకల్లు మధ్య రూ.1264కోట్ల మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్ట్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రైల్వే వరాలు ప్రకటిస్తోంది. ఇప్పటికే ఏపీలో కొత్త రైల్వే లైన్లను ఏర్పాటు చేయడంతోపాటు, అనేక రైల్వే ప్రాజెక్టులకు యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్న కేంద్ర రైల్వే తాజాగా మరో భారీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ బళ్లారి గుంతకల్లు మార్గంలో మూడో మరియు నాలుగో రైల్వే లైన్ ల నిర్మాణం కోసం ఆమోదం తెలిపింది.
1264కోట్ల రూపాయలతో మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్ట్
ఈ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టుకు మొత్తం 1264కోట్ల రూపాయలను కేటాయించారు. ఇక ఈ విషయాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ కింద ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ముఖ్యంగా ఈ ప్రాజెక్టులో లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని పెంచడం పైన ప్రధానంగా దృష్టి పెడుతున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా సుమారు 46 కిలోమీటర్ల పొడవైన మార్గంలో అదనపు రైల్వే లైన్లను నిర్మాణం చేయనున్నారు.

ప్రాజెక్ట్ లో భాగంగా చేసే నిర్మాణాలివే
ఇందులో 52 చిన్న వంతెనలు, ఏడు పెద్ద వంతెనలు, ఒక మెగా బ్రిడ్జి ఉంటాయి. ప్రత్యేకంగా వేదవతి నది పైన 762 మీటర్ల పొడవైన భారీ రైల్వే వంతెన నిర్మాణం జరగనుంది. ఈ మార్గం ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాలలోని మూడు జిల్లాల గుండా వెళుతుంది. అయితే ఈ రైల్వే లైన్ల నిర్మాణానికి అవసరమైన భూమిలో దాదాపు 80 శాతం వరకు ఇప్పటికే అందుబాటులో ఉందని అధికారులు చెబుతున్నారు.
మూడేళ్ళలో ప్రాజెక్ట్ పూర్తి చెయ్యాలని టార్గెట్
ప్రాజెక్టును 2028- 29 నాటికి అంటే మూడు సంవత్సరాలలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ రైల్వే లైన్ విస్తరణ వల్ల 99 గ్రామాలకు మెరుగైన రైల్వే సేవలు అందుతాయి. దాదాపు ఏడు లక్షల మందికి రైల్వే ప్రయాణ సౌకర్యాలు మెరుగుపడతాయి. ఈ ప్రాంతంలో ఈ రైల్వే లైను ఏర్పాటు చేయడం వాణిజ్యపరంగా కూడా మెరుగైన లాభాలను ఇస్తుంది.
పర్యాటకంగా, వాణిజ్య పరంగా లబ్ది
సున్నపురాయి, డోలమైట్, ఇనుప ఖనిజం, ఉక్కు, బొగ్గు, ఎరువులు, ఆహార ధాన్యాలు వంటి వస్తువుల రవాణా సామర్థ్యం పెరుగుతుంది. సరుకు రవాణాలో గణనీయమైన మార్పు వస్తుంది. పర్యాటకంగాను ఈ ప్రాంతాలలో ఉన్న బళ్లారి కోట, శ్రీ కుమారస్వామి ఆలయం వంటి వాటికి పర్యాటకుల రద్దీ పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మధ్య ఉన్న ఈ మార్గంలో ఉన్న రైల్వే రైళ్లపై ఇప్పటికే రద్దీ ఎక్కువగా ఉంది.
సరుకు రవాణా సేవలతో ఈ ప్రాంత అభివృద్ధికి దోహదం
అందుకే అదనపు మూడు నాలుగు లైన్లను ఏర్పాటు చేయాలని ప్రయాణికులకు మరింత సౌకర్యాన్ని కూడా కల్పించాలని, ఇదే సమయంలో సరుకు రవాణా సేవలతో ఈ ప్రాంత అభివృద్ధికి దోహదం చేయాలని రైల్వే భావిస్తోంది. అందులో భాగంగానే కేంద్రీకృత కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్రం తీసుకునే నిర్ణయంతో రెండు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త చెప్పినట్టు అయింది.












Click it and Unblock the Notifications