తిరుమల భక్తులకు శుభవార్త: ఆన్‌లైన్‌లో ప్రత్యేక ప్రవేశ టికెట్లు, గదులు; తాజా రద్దీ ఇలా!
కలియుగ ప్రత్యక్ష దైవం, ఆపదమొక్కులవాడు అయిన వెంకటేశ్వర స్వామి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లకు సంబంధించిన నవంబర్ నెల కోటాను విడుదల చేసిన టిటిడి నేడు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను విడుదల చేసింది.
స్పెషల్ ఎంట్రీ టికెట్ల కోటా, గదుల కోటా విడుదల చేసిన టీటీడీ
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన నవంబర్ నెల కోటాను ఆగస్ట్ 18న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేసిన టిటిడి, నేడు ఉదయం 10 గంటలకు నవంబర్ మాసానికి సంబంధించి 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ టికెట్లను విడుదల చేసింది. ప్రస్తుతం ఇవి ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. అలాగే నేడు 3గంటలకు తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేసింది.

ఇప్పటికే నవంబర్ కోటాలో ఆర్జిత సేవలు, శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు విడుదల
భక్తులు ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ప్రత్యేక దర్శన టికెట్లు, గదులను బుక్ చేసుకోవచ్చు. ఇక ఇప్పటికే శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను కేటాయించిన టీటీడీ, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, వార్షిక పుష్పయాగం టికెట్లను విడుదల చేసింది. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటా విడుదల చేసింది. ఆగస్ట్ 23వతేదీ అంగప్రదక్షిణం టోకెన్ల కోటా, శ్రీవాణి ట్రస్టు టికెట్లు విడుదల చేసింది.
నేడు భక్తుల రద్దీ ఇలా
కాగా ఈరోజు పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి కొండపైన భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గత వారం రోజులు శ్రీవారి దర్శనం కోసం భక్తులు గంటలు తరబడి వేచి ఉండాల్సి రాగా ప్రస్తుతం కాస్త త్వరగా భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కలుగుతుంది. ఇక నేటి ఉదయం స్వామివారి దర్శనం కోసం భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని నాలుగు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు.
స్వామి దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే
స్వామివారి సర్వదర్శనానికి వెళ్లే భక్తులకు ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల సమయం పడుతున్నట్టు టిటిడి అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే నిన్న తిరుమల శ్రీవారిని 72 వేల 119 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 25వేల 294 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. టీటీడీకి 4.02 కోట్ల రూపాయలు హుండీ ఆదాయం వచ్చింది అని టిటిడి పేర్కొంది.












Click it and Unblock the Notifications