శ్రీశైలం మల్లన్న భక్తులకు గుడ్ న్యూస్..
మహాశివరాత్రి వేడుకలకు శైవ క్షేత్రాలు ముస్తాబవుతున్నాయి. ఈ క్రమంలోనే శ్రీశైలంలో ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పలు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు భారీ ఎత్తున వస్తుంటారు. ఈ నేపథ్యంలోనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శ్రీశైలం దేవస్థానం అన్నిరకాల ఏర్పాట్లు చేస్తోంది.
అయితే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వచ్చే ప్రతి భక్తుడికి ఉచితంగా ఒక లడ్డూ అందించాలని ఇటీవల ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం ఆదేశాల మేరకు శ్రీశైలం దేవస్థానం చర్యలు ప్రారంభించింది. ప్రతి భక్తుడికి 50 గ్రాముల బరువుండే లడ్డూను ఉచితంగా ఇవ్వనున్నారు. ఇందుకోసం మొత్తం 4 లక్షల లడ్డూలు తయారు చేస్తున్నారు. ఫిబ్రవరి 24 నుంచి 27వ తేదీ వరకు భక్తులకు ఉచితంగా లడ్డూలు అందజేయనున్నారు.

ఈ క్రమంలోనే లడ్డూ ప్రసాదాల తయారీని ఆలయ ప్రాంగణంలోని పోటులో లాంఛనంగా శ్రీకారం చుట్టారు. బ్రహ్మోత్సవాల కోసం మొత్తం 35 లక్షల లడ్డూలను తయారు చేయనున్నారు. రోజుకు 2 లక్షల నుంచి 4 లక్షల లడ్డూలు తయారు చేయనున్నారు. 100 గ్రాముల లడ్డూ రూ.20 చొప్పున కౌంటర్ల ద్వారా విక్రయించనున్నారు. లడ్డూ కౌంటర్ల వద్ద రద్దీని తగ్గించడానికి ప్రైవేట్ సత్రాల వద్ద కూడా లడ్డూ విక్రయాలు జరపాలని దేవస్థానం నిర్ణయించింది.
అలానే భక్తుల ఆకలి తీర్చేందుకు అన్న ప్రసాదం పంపిణీ చేయనున్నారు. అన్నపూర్ణ భవన్‌లోని రెండు హాల్ లలో శివ భక్తులకు, సాధారణ భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ చేయనున్నారు. మూడో హాలులో పోలీసులకు.. నాలుగు, ఐదు హాల్లలో కళాకారులు, వీఐపీలకు భోజనం ఏర్పాట్లు చేస్తున్నారు. రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 4.30 వరకు అన్న ప్రసాదం పంపిణీ జరగనుంది. అలాగే సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకూ అన్న ప్రసాదం అందజేయనున్నట్టు అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications