ఏపీలో పేదలకు శుభవార్త: రేపటినుండే పేదలకిచ్చిన ఇళ్ళపట్టాలకు ఉచిత రిజిస్ట్రేషన్!!
ఏపీ ప్రభుత్వం నిరుపేదలకు గుడ్ న్యూస్ చెప్పింది. రేపటినుండి వచ్చే నెల 9వరకు పేదలకు అందించిన ఇళ్ల పట్టాలకు ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేయనుంది. ఈ ఉచిత రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వీఆర్వోలు నిర్వహిస్తారని, జిల్లా కేంద్రాల్లో జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించింది.
రిజిస్ట్రేషన్లు చేసేందుకు రెవిన్యూ శాఖ ఏర్పాట్లను పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమం కింద 31.19 లక్షల మందికి ఇళ్లపట్టాలు ఇచ్చిన ప్రభుత్వం, 17 వేలకు పైగా వైయస్సార్ జగనన్న కాలనీలను నిర్మించింది. ఇక వీటన్నిటికీ ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇళ్ల పట్టాలు పొందిన పదేళ్ల తర్వాత వాటిపై లబ్ధిదారులకు సర్వహక్కులు పొందేలా, వాటిని లబ్దిదారులు అవసరాల కోసం వినియోగించుకునేలా జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

ఇప్పటికే ఏపీ సర్కార్ ఇళ్ల పట్టాలు పొందిన పదేళ్ల తర్వాత వాటిపై లబ్ధిదారులు సర్వ హక్కులు పొందేలా ప్రభుత్వం అసైన్డ్ భూముల చట్టాన్ని సవరింపు చేసింది. ఇప్పుడు దాని ప్రకారమే ఇళ్ల స్థలాలను ఇచ్చిన వారికి ఉచిత రిజిస్ట్రేషన్ చేయించి, ఆ స్థలాలపై పూర్తి హక్కులను కల్పించనుంది. ప్రభుత్వం చేస్తున్న రిజిస్ట్రేషన్ ప్రకారం ఈ పట్టాలు పదేళ్ల గడువు ముగిసిన తర్వాత ఆటోమేటిక్‌గా సేల్ డీడ్‌లుగా మారతాయి.
అప్పుడు ప్రభుత్వం జోక్యం లేకుండానే నిరుపేదలకు నేరుగా ఆ స్థలాలను అమ్ముకోవడానికీ, ఇతర ప్రయోజనాల కోసం వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. పేదలు ఇబ్బందులు పడకుండా జగన్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇక రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
వీఆర్వోలు ప్రభుత్వం తరఫున రిజిస్ట్రేషన్లు చేస్తారు. ఫిబ్రవరి 9వ తేదీ కల్లా రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. విఆర్వోలు సచివాలయం లో అందుబాటులో ఉండేలా తహసీల్దార్లు చూడాలని, రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత అర్హులకు కన్వేయన్స్ డీడ్ లను పంపిణీ చేయాలని సూచించింది ఏపీ ప్రభుత్వం.












Click it and Unblock the Notifications