అమరావతికి ప్రపంచ దిగ్గజ సంస్థ - కీలక మలుపు..!!
ఏపీ రాజధాని అమరావతికి మరో ప్రముఖ దిగ్గజ సంస్థ రానుంది. ఈ మేరకు కసరత్తు కీలక దశకు చేరుకుంది. అమరావతి పనులను ప్రధాని మోదీ రీ లాంఛ్ చేసారు. ఇప్పటికే టెండర్లు ఖరారు చేసారు. రెండో విడత భూ సమీకరణ దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. అమరావతిలో భూముల కేటాయింపుల పైన మంత్రివర్గ ఉప సంఘం పరిశీలన చేస్తోంది. ఇదే సమయంలో అమరావతి కేంద్రంగా ప్రపంచ దిగ్గజ టెక్ కంపెనీ కార్యకలాపాలు ఏర్పాటుకు వీలుగా తొలి అడుగు పడింది. ఇది పూర్తి చేస్తే.. రాజధాని అమరావతికి కీలక మలుపు కానుంది.
అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. ప్రఖ్యాత సంస్థలను అమరావతికి రప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా అమరావతికి ప్రపంచ దిగ్గజ సంస్థ గూగుల్ రానుంది. రాష్ట్రప్రభుత్వంతో ఉన్నతస్థాయిలో గూగుల్ ప్రతినిధులు తాజాగా ప్రభుత్వంతో చర్చించారు. ఇందుకుగాను అనంతవరం, నెక్కల్లు మధ్య సమీపంలోని ఈ-8 రోడ్డు పక్కన సర్వేనంబర్లు 10, 12, 13, 15, 16లో సుమారు 143 ఎకరాల భూమి ఉంది. దాన్ని గూగుల్‌కు కేటాయించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. గూగుల్ సంస్థ ప్రారంభించబోయే ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు అమరావతిలో అంకురార్పణ చేయనున్నారని తెలిసింది. ఆ సంస్థ ప్రతినిధులు, సీఆర్డీఏ అధికారులతో కలసి నెక్కల్లులో స్థలం పరిశీలించారు.

ఈ ప్రాంతానికి సమీపంలోనే ప్రతిపాదిత విమానాశ్రయం, రైల్వేస్టేషన్ కూడా రానుండడంతో సంస్థ ప్రతినిధులు ఈ స్థలం వైపే మొగ్గుచూపినట్లు సమాచారం. గూగుల్ సంస్థను ఇక్కడ నెలకొల్పితే పారిశ్రామికంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అమరావతిలో స్థలాల కేటాయింపు పైన ప్రత్యేకంగా ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం ప్రతిపాదనల పైన నిర్ణయాలను సిఫారసు చేస్తోంది.
కాగా, విశాఖ కేంద్రంగా ప్రముఖ ఐటీ కంపెనీలు కొలువు తీరేలా ప్రయత్నాలు సాగుతున్నాయి. అదే సమయంలో అమరావతిలోనూ కీలక సంస్థలను రప్పించేందుకు ప్రభుత్వం మంత్రాంగం సాగిస్తోంది. అందులో భాగంగా తాజాగా గుగూల్ ప్రతినిధులు అమరావతిలో పర్యటించారు. భూమి పైన ప్రభుత్వం నుంచి సానుకూలత రావటంతో.. గుగూల్ అమరావతిలో కార్యకలాపాల పైన అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.












Click it and Unblock the Notifications