కరణం బలరాంతో కుదిరేనా: గొట్టిపాటి రవి టిడిపిలో చేరడం వెనక..?
హైదరాబాద్: ప్రకాశం జిల్లా అద్దంకి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు గొట్టిపాటి రవికుమార్ తెలుగుదేశం పార్టీలో చేరడం వెనక పెద్ద కథనే ఉందని అంటున్నారు. ఆయన టిడిపిలో చేరడానికి వెనక గల కారణాలు ఏమిటి, ఆయనకు టిడిపి నేత కరణం బలరాంతో కుదురుతుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి, అక్కడి ఆయన ప్రత్యర్థి రామసుబ్బారెడ్డికి మధ్య ఫ్యాక్షన్ కక్షలు ఉన్నట్లుగానే మాజీ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తికి, గొట్టిపాటి రవికుమార్ కుటుంబానికి మధ్య వైరం ఉందని ప్రచారం సాగుతోంది. అయినా ఆయన ఈ నెల 29వ తేదీన టిడిపిలో చేరడానికే మొగ్గు చూపారు.
ఆయన ఆ నిర్ణయం తీసుకోవడం వెనక పని చేసిందేమిటనే ప్రశ్న తలెత్తుతోంది. ఆయన పార్టీని వీడేందుకు వైసీసీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి వ్యవహారశైలి ప్రధాన కారణమని పార్టీ వర్గాలు అంటున్నాయి. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో మార్టూరు నుంచి కాంగ్రెస్ తరపున గెలిచిన రవికుమార్, మళ్లీ 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా అద్దంకి నుంచి కరణం బలరాంపై గెలిచారు. 2014 ఎన్నికల్లో బలరాం కుమారుడు వెంకటేశ్‌పై విజయం సాధించారు.

మూడుసార్లు అసెంబ్లీకి ఎన్నికైన గొట్టిపాటికి జగన్ తగిన గౌరవం ఇవ్వలేదని, సీనియర్ నేతగా గుర్తించ లేదని అంటున్నారు. ప్రకాశం జిల్లాలో తన బంధువైన ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కుటుంబానికే జగన్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారనే అభిప్రాయం ఉంది.. జిల్లా పరిషత ఎన్నికల్లో వైసీపీ ఆధిక్యం సాధించడానికి రవికుమార్ కష్టపడినా పార్టీ అధ్యక్షుడి నుంచి ప్రశంసలు రాలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
నాగార్జున సాగర్ నీటి కోసం మంత్రికి దరఖాస్తు ఇచ్చేందుకు వెళ్లిన సమయంలో బలరాం, గొట్టిపాటి వర్గాల మధ్య పెద్ద తగాదానే జరిగింది. ఈ సమయంలో గొట్టిపాటి వాహనంపై దాడి జరిగింది. ఇలాంటి దాడులు సహించబోమని తెలుగుదేశం పార్టీ నుంచి హెచ్చరికలు వచ్చాయి. కానీ ఆయనకు మద్దతుగా జగన్ గానీ, వైసీపీ నేతలు గాని మాట్లాడలేదని అంటున్నారు.
గొట్టిపాటి మనస్తాపం చెందడానికి గల కారణాల్లో అదొకటని అంటున్నారు. 2014 ఎన్నికల సమయంలో కాంగ్రెసు నుంచి వైసిపిలో చేరి విజయం సాధించారు. కానీ గొట్టిపాటికి పార్టీలో తగు ప్రాధాన్యం, గుర్తింపు లభించలేదని అంటున్నారు. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి గొట్టిపాటి వర్గానికే చెందిన ఓ నాయకుడిని ఎంపిక చేసిన జగన్ మాటవరసకైనా రవికుమార్‌కు చెప్పలేదు. దాంతో గొట్టిపాటి రవికుమార్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.












Click it and Unblock the Notifications