తెరుచుకోని పారాచ్యూట్.. నేవీ కమాండో మృతి
విజయనగరంలో విషాదం చోటుచేసుకుంది. మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ శిక్షణలో చోటుచేసుకున్న అపశ్రుతివల్ల నేవీ అధికారి చందక గోవింద్(31) మరణించారు. గోవింద్ స్వగ్రామమైన పర్లలో విషాద ఛాయలు అలముకున్నాయి. పారాచ్యూట్ తెరుచుకోకపోవడంవల్లే ఈ ప్రమాదం సంభవించినట్లు నేవీ అధికారులు వెల్లడించారు.పశ్చిమ బెంగాల్ లోని బంకురా జిల్లాలో శిక్షణ కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
శిక్షణలో భాగంగా గోవింద్ ఎయిర్ క్రాఫ్ట్ నుంచి కిందకు దూకిన సమయంలో పారాచ్యూట్ పూర్తిగా తెరుచుకోలేదు. దీంతో కిందపడిన గోవింద్ తీవ్ర గాయాలకు గురై మృతిచెందారు. బుర్ధ్వాన్ జిల్లాలోని పనాగఢ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో పారాట్రూపర్స్ శిక్షణ బృందంలో కమాండో గోవింద్ విధులు నిర్వహిస్తున్నారు. తీవ్ర గాయాలకు గురైన గోవింద్ ను బార్జోరా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

పనాగఢ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో ఉన్న వ్యూహాత్మక విమానాల్లో జవాన్లకు ప్రత్యేక ట్రైనింగ్ ఇస్తారు. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన స్పెషల్ ఫోర్సెస్ యూనిట్లు ఇక్కడ కసరత్తుల్లో పాల్గొంటాయి. C130J సూపర్ హెర్క్యులస్ విమానం నుంచి డ్రాప్ సమయంలో గోవింద్ అదృశ్యమయ్యారని భారత వైమానిక దళం తెలిపింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. గోవింద్ స్వగ్రామంవిజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పర్ల గ్రామం. అతని భౌతిక కాయం రేపు స్వగ్రామం చేరుకోనుంది.












Click it and Unblock the Notifications