విద్యాశాఖలోకి మున్సిపల్ టీచర్లు - సర్వీసు రూల్స్ విడుదల..!!
పురపాలక ఉపాధ్యాయుల సర్వీసు బదలాయింపు ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయింది. మున్సిపల్ ఉపాధ్యాయుల సర్వీసును ప్రభుత్వం పాఠశాల విద్యా శాఖలో విలీనం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మున్సిపాలిటీల్లో టీచర్లకు ప్రస్తుతం ఉన్నట్టుగానే వేర్వేరుగా సర్వీసు రూల్స్ రూపొందించి నాలుగు జీవోలు జారీ చేసింది. ఇక పై జిల్లా యూనిట్ గా వారి నియామకాలు, బదిలీలు చేపట్టనున్నారు. ఈ ప్రక్రియను కూడా విద్యా శాఖ నిర్వహిస్తుంది.
మున్సిపాల్టీల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులను జీవో నెంబర్ 7, నగరపాలక సంస్థల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు జీవో నెంబర్ 8, జీవీఎంసీ ఉపాధ్యాయులకు జీవో నెంబర్ 9, విజయవాడ నగరపాలక సంస్థ ఉపాధ్యాయులకు జీవో నెంబర్ 10 జారీ అయ్యాయి. దీంతో పురపాలక ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల అంశం పూర్తిగా విద్యా శాఖకు అప్పగించారు. గతంలో నగర, పురపాలక సంఘాల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు వేర్వేరు సర్వీసు నిబంధలు ఉండేవి. దీంతో వారు ఆ సంస్థ పరిధిలోని పాఠశాలలకు మాత్రమే బదిలీ అయ్యారు. ఇప్పుడు జిల్లా యూనిట్ గా వారి నియామకాలు, బదిలీల ప్రక్రియ చేపడతారు.

సుదీర్ఘకాలంగా మున్సిపల్ టీచర్లకు ఉమ్మడి సర్వీసు రూల్స్ రూపొందించాలనే డిమాండ్ ఉండగా, గతేడాది ప్రభుత్వం జీవో 84 ద్వారా అందరికీ కలిపి ఒకే సర్వీసు రూల్స్ చేసే ప్రయత్నం చేసింది. దీనిపై అనేక అభ్యంతరాలు వ్యక్తం కావడంతో మళ్లీ ప్రస్తుత పద్ధతిలోనే గ్రేటర్ కార్పొరేషన్లు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఎవరికి వారుగా బదిలీలు చేసుకునేలా తాజా రూల్స్ తయారుచేసింది. మున్సిపల్ కార్పొరేషన్లలో అపాయింట్ అథారిటీని మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ నుంచి డీఈవోకు బదిలీ చేసింది.
విజయవాడలోని మున్సిపల్ పాఠశాలలకు అపాయింటింగ్ అథారిటీని కార్పొరేషన్ స్థానంలో పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీగా మార్చింది. బదిలీలు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే జరుగుతాయని తెలిపింది. ప్రభుత్వం ఈ మేరకు స్పష్టత ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.












Click it and Unblock the Notifications