మిలిట్రీ హెలికాఫ్టర్ లో నెల్లూరు తరలింపు - 23న గౌతమ్ అంత్యక్రియలు : సీఎంతో సహా మంత్రులంతా..!!
ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం షాక్ నుంచి ఇంకా సహచర మంత్రులు తేరుకోలేదు. సీఎం జగన్ దంపతులు హైదరాబాద్ లో గౌతమ్ భౌతిక కాయానికి నివాళి అర్పించారు. సీఎం జగన్ ను చూడగానే గౌతమ్ తల్లి కన్నీరు మున్నీరుగా విలపించారు. సీఎం జగన్ సైతం గౌతమ్ భౌతిక కాయం చూస్తూ ఎమోషనల్ అయ్యారు. తండ్రి రాజమోహన్ రెడ్డిని ఓదార్చారు. గౌతమ్ సతీమణి...కుమార్తెను పరామర్శించారు. మంత్రులు తమ సహచర మంత్రికి నివాళి అర్పించారు. గుండె పోటుతో ఒక్క సారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు బుధవారం నిర్వహించాలని నిర్ణయించారు.
కుమారుడు క్రిష్ణార్జున్ రెడ్డి అమెరికా నుంచి బయల్దేరారు. నేరుగా మంగళవారి చెన్నై చేరుకొని అక్కడ నుంచి నెల్లూరు వస్తారు. ఇక, ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న గౌతమ్ రెడ్డి భౌతిక కాయాన్ని మంగళవారం ఉదయం ప్రత్యేకంగా ఆర్మీ మిలిటరీ హెలికాఫ్టర్ లో బేగంపేట నుంచి నెల్లూరుకు తరలిస్తారు. ఉదయం 8.30 గంటలకు ఇక్కడ నుంచి నెల్లూరు తీసుకెళ్తారు. మంగళవారం మొత్తం నెల్లూరు లో కార్యకర్తల సందర్శ కోసం గౌతం రెడ్డి ఇంట్లో భౌతిక ఖాయం ఉంచాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.

బుధవారం మధ్నాహ్నం 1 గంటకు గౌతమ్ రెడ్డి స్వగ్రామం బ్రాహ్మణ పల్లెలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. గౌతమ్ అంత్య క్రియలకు సీఎం జగన్ తో పాటుగా మంత్రులు అందరూ హాజరు కానున్నారు. మంత్రి హోదాలో ఉంటూ మరణించటంతో..రెండు రోజులు రాష్ట్ర ప్రభుత్వం సంతాప దినాలుగా ప్రకటించింది. సచివాలయం పైన జెండాను అవనతం చేసారు. పార్టీ ఎంపీలతో సహా.. ఎమ్మెల్సీలు...ఎమ్మెల్యేలు అందరూ అంత్య క్రియలకు హాజరు అవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక, నెల్లూరు జిల్లాలో సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్న కుటుంబం కావటంతో..నెల్లూరులోనూ భారీ సంఖ్యలో గౌతమ్ రెడ్డి భౌతిక కాయం దర్శించేందుకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉంది. దీంతో..ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications