Onions : ఏపీలో క్రమంగా పెరుగుతున్న ఉల్లి ధరలు-స్టాక్ పెట్టుకోవాల్సిందేనా ?
దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఉల్లిధరల పెరుగుదల ప్రభావం ఏపీపైనా పడుతోంది. గత వారం రోజుల్లో ఉల్లిధరలు క్రమంగా పెరుగుతున్నాయి. అసలే ఉత్పత్తి తగ్గడం, నాఫెడ్ నుంచి వస్తున్న ఉల్లిపాయలు డిమాండ్ కు తగ్గట్టుగా లేకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు. సహజంగానే వీటి ధర ఎక్కువగా ఉంటోంది. దీంతో రాష్ట్రంలోని రైతు బజార్లతో పాటు సూపర్ మార్కెట్లలోనూ, ఇతర షాపుల్లోనూ ఉల్లి ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
రాష్ట్రంలోని పలు రైతు బజార్లలో ఉల్లిధరలు ప్రస్తుతం 30 రూపాయలకు పైగా నమోదవుతున్నాయి. అలాగే సూపర్ మార్కెట్లు, సూపర్ బజార్లలో, ఇతర షాపుల్లో 40 రూపాయల వరకూ ఉన్నాయి. ఈ ధరలు నిన్న మొన్నటి వరకూ సగమే ఉన్నాయి. అయితే క్రమంగా పెరుగుతున్న డిమాండ్, ఉత్పత్తి తక్కువగా ఉండటం వంటి కారణాలతో సమస్య అంతకంతకూ పెరుగుతోంది. దీంతో తప్పనిపరిస్ధితుల్లో వ్యాపారులు కూడా ధరలు పెంచుకుంటూ పోతున్నారు.

దేశవ్యాప్తంగా సెప్టెంబర్ నుంచి ఉల్లి ధరల పెరుగుదల ఊహించిన కేంద్రం.. డిసెంబర్ వరకూ ఎగుమతులపై 40 శాతం సుంకం విధించింది. దీంతో పాటు నాఫెడ్ ద్వారా ఉల్లి సేకరించి సరఫరా చేస్తోంది. అయినా ఇది డిమాండ్ కు సరిపడా ఉండటం లేదు. దీంతో ధరలు పెరుగుతూ పోతున్నాయి. నిన్న మొన్నటివరకూ టమోటా ధర 200 దాటిపోయింది. ఇప్పుడు 25 రూపాయల దగ్గర్లో ఉంది. ఇప్పుడు ఉల్లి ధరలు కూడా మంటపుట్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
రాష్ట్రంలో ప్రధాన మార్కెట్లకు ఉల్లి పాయలు సరుకు తక్కువగా వస్తోంది. అదే సమయంలో నాఫెడ్ నుంచి కేంద్రం ఇస్తున్న ఉల్లిపాయలు నాసిరకంగా ఉంటున్నాయి. దీంతో బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధరకు ఉల్లి కొనక తప్పడం లేదు. ఇదే అదనుగా వ్యాపారులు రేట్లు పెంచేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న ఉల్లి నాణ్యంగా ఉండటం వల్లే రేటు ఎక్కువగా ఉంటోందని వారు చెప్తున్నారు. ఏదేమైనా వచ్చేది పండుగల సీజన్ కావడంతో ఉల్లి ధరల మంట తప్పేలా లేదు. సాధ్యమైనంత స్టాక్ పెట్టుకోవడమే మంచిదనే చర్చ నడుస్తోంది.












Click it and Unblock the Notifications