ఇంత క్రౌడ్ ఎప్పుడూ చూడలేదు: అమెరికా నుంచి వచ్చారు: చంద్రబాబు
Chandrababu Naidu: ఏపీలో పోలింగ్ ముమ్మరంగా సాగుతోంది. ఈ ఉదయం సరిగ్గా 7 గంటలకు రాష్ట్రంలో గల 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్ మొదలైంది. సాయంత్రం వరకు కొనసాగుతుంది. తొలి గంటలోనే పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసుల, కేంద్ర ఎన్నికల అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను పూర్తి చేశారు. పోలింగ్ స్టేషన్ల వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఉండటానికి అవసరమైన అన్ని చర్యలను యుద్ధ ప్రాతిపదికన తీసుకున్నారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని భాకరాపురంలో ఆయన ఓటు వేశారు. ఇక్కడి జయ మహల్ ప్రాంతంలో గల ఆంగన్వాడి పోలింగ్ బూత్ నంబర్ 138లో ఆయన కొద్దిసేపటి కిందటే ఓటు వేశారు.
మరోవంక- తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. భార్య భువనేశ్వరితో కలిసి పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారాయన. కొద్దిసేపు క్యూలో నిల్చున్నారు. తనవంతు వచ్చిన తరువాత ఓటు వేశారు.
అనంతరం తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు చంద్రబాబు. తెలుగుదేశం పార్టీకి ఓటర్లు మద్దతు పలుకుతున్నారని స్పష్టం చేశారు. తమను గెలిపించడానికి ఎక్కడెక్కడి నుంచో తెలుగువారందరూ ఏపీకి వచ్చారని అన్నారు. విదేశాల్లో నివసించే తెలుగు వాళ్లు సైతం టీడీపీకి ఓటు వేయడానికి ఇక్కడికి చేరుకున్నారని చెప్పారు.
హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో నివసించే తెలుగు ఓటర్లు కూడా భారీ ఎత్తున ఏపీకి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటోన్నారని అన్నారు. ఓటు వేయడానికి ఎక్కడెక్కడి నుంచో ఇంత మంది రాష్ట్రానికి తరలివచ్చారని చంద్రబాబు పేర్కొన్నారు. ఇంతమందిని తన రాజకీయ జీవితంలో తొలిసారిగా చూస్తోన్నానని అన్నారు. ప్రజలు మార్పును కోరుకుంటోన్నారనడానికి ఇదే నిదర్శనమని చంద్రబాబు వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications