పుత్రుడి నిర్వాకం: మంత్రి రావెలకు గుంటూరు మహిళల సెగ
గుంటూరు/ హైదరాబాద్: ఓ మహిళా టీచర్ పట్ల హైదరాబాదులో అసభ్యంగా ప్రవర్తించిన మంత్రి రావెల కిశోర్ బాబు తనయుడు సుశీల్‌కు వ్యతిరేకంగా గుంటూరులో శనివారంనాడు మహిళలు ఆందోళనకు దిగారు. మంత్రి కుమారుడు సుశీల్‌ను అరెస్టు చేయాలని కోరుతూ మహిళా సంఘాలు ఆందోళనకు దిగాయి.
మంత్రి కొడుకైతే అతనికి కొమ్ములుంటాయా.. రాజ్యాంగానికి అతీతుడా అంటూ మహిళలు నినాదాలు చేశారు. మైనారిటీ సంఘాల నాయకులు ఆ నినాదాలతో రాస్తారోకోకు దిగారు. పత్తిపాడులోని ఓల్డ్ మద్రాసు రోడ్డుపై ఆందోళనకారులు బైఠాయించారు. దీంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి.

రావెల సుశీల్ ఉదంతంపై తెలంగాణ మైనారిటీ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దోషులు ఎంతటివారైనా వారిని వదిలిపెట్టకూడదని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మైనారిటీ కమిషన్ చైర్మన్ కోరారు. కాగా, కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని హైదరాబాదు బంజారాహిల్స్ కార్పోరేటర్ విజయలక్ష్మి కోరారు.
బాధితురాలికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని ఆమె చెప్పారు. నిందితుడిని అరెస్టు చేసేంత వరకు ఊరుకునేది లేదని ఆమె అన్నారు. కాగా, సుశీల్‌ను అరెస్టు చేయడానికి పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications