విజయమ్మ ఓటమి: ఫ్యాక్షన్, స్థానిక ప్రచారం వల్లే
విశాఖ/హైదరాబాద్: దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి భార్య, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ఓటమిని ఆ పార్టీ జీర్మించుకోలేకపోతోంది. తిరుగులేని నేత భార్య, జగన్ తల్లి అయిన విజయమ్మ ఓటమిపై సర్వత్రా ఆసక్తి కనిపించింది. అనూహ్యంగా బిజెపి అభ్యర్థి కంభంపాటి హరిబాబు దాదాపు లక్ష ఓట్లతో గెలుపొందారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయక పోవడం కంటే విజయమ్మ ఓటమే స్థానిక పార్టీ నేతలను ఎక్కువగా కలవరపరుస్తోందట.
విజయమ్మ ఓటమికి రెండు కారణాలుగా ప్రధానంగా చెబుతున్నారు. ఒకటి స్థానికేతరురాలు, రెండు కడప తరహా ఫ్యాక్షన్ సంస్కృతిని విశాఖకు తీసుకు వస్తారని విపక్షాలు జోరుగా ప్రచారం చేశాయి. ఈ రెండు ఓటమికి ప్రధాన కారణాలుగా పలువురు భావిస్తున్నారు.

విజయమ్మను ఎంపిగా గెలిపించడం ద్వారా ప్రశాంత విశాఖ నగరంలో ఫ్యాక్షన్ సంస్కృతి పెచ్చుమీరుతుందంటూ సాగిన ప్రచారమే ఆమె ఓటమికి కారణమైందని, విజయమమ్మ పోటీ చేసిన విశాఖ ఎంపి పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యే అభ్యర్థులు ఓటమి పాలుకావడం, కనీస ఓటింగ్ కూడా లేని బిజెపి అభ్యర్థికి సుమారు లక్ష ఓట్ల మెజార్టీ రావడం పరిశీలిస్తే నిజమనే అనిపిస్తోందని అంటున్నారు.
ఓటమి ఎరుగని వైయస్ కుటుంబంలో తొలిసారిగా విజయమ్మ ఘోర పరాజయాన్ని ఆ పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేక పోతున్నారు. విశాఖ నుంచి విజయమ్మ పోటీ చేయడం ద్వారా తమకు కూడా ఎంతోకొంత లాభిస్తుందని భావించారు. అయితే అది రివర్స్ అయింది. విపక్షాల స్థానికేతరురాలు, ఫ్యాక్షన్ ప్రచారంతో ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులనే ముంచిందంటున్నారు.
చివరి నిముషంలో విజయమ్మ గెలుపు కోసం ఎంపి ఓటు క్రాస్ చేయించేందుకు సైతం పార్టీలోని పెద్దలు యత్నించడం గమనార్హం. విశాఖ నగర పరిధిలోని ఆరు నియోజకవర్గాల్లో గెలుపొందిన తెలుగుదేశం అభ్యర్థులకు 1.72 లక్షల ఓట్ల ఆధిక్యం లభించగా, బిజెపి అభ్యర్థి హరిబాబు మెజార్టీ మాత్రం 99 వేలకే పరిమితమైంది.
అన్ని నియోజకవర్గాల్లోను ఇదే పరిస్థితి కన్పించింది. ముఖ్యంగా విశాఖ నగరంలోని గాజువాక, విశాఖ తూర్పు, దక్షిణం, పశ్చిమం, భీమిలి నియోజకవర్గాలతో పాటు విజయనగరం జిల్లాలోని ఎస్ కోట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. విశాఖ ఉత్తరం సెగ్మెంట్‌లో మాత్రం బిజెపి అభ్యర్థి గెలుపొందారు.
ఎస్ కోట నియోజకవర్గాన్ని పక్కన పెడితే మిగిలిన ఆరు అసెంబ్లీ సెగ్మెంట్‌లలో తెలుగుదేశం, బిజెపి అభ్యర్థులకు లభించిన ఓట్లు బిజెపి ఎంపి అభ్యర్థికి లభించలేదు. విజయమ్మను విశాఖ నుంచి పోటి చేయించడం ద్వారా రహస్య అజెండా ఉందంటూ ప్రత్యర్థి పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం సాగించాయి. రాయలసీమ సంస్కృతి విశాఖ నగరంలో పెచ్చురిల్లుతుందంటూ చాపకింద నీరులా విస్తృత ప్రచారం చేశారు.
ఘర్షణలు, ఫ్యాక్షన్ దాడులు వంటి సంస్కృతి ప్రశాంత విశాఖను కల్లోల పరుస్తుందంటూ ప్రచారం చేశారు. ఈ ప్రచారం ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపించిందంటున్నారు. ప్రశాంతతను కోరుకునే విశాఖ ప్రజలు విజయమ్మకు వ్యతిరేకంగా ఓటేశారంటున్నారు. స్థానికేతరురాలు విషయానికి వస్తే.. గత పదేళ్లుగా విశాఖేతరులను గెలిపించడం వల్ల ఈ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని, మరోసారి అలాంటి తప్పు చేయవద్దని టిడిపి, బిజెపితో పాటు కిరణ్ పార్టీ జోరుగా ప్రచారం చేసింది.












Click it and Unblock the Notifications