బాబు ఇంటికి హరికృష్ణ: రాజ్యసభకు పట్టు, మారిన సీన్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నివాసంలో జరుగుతున్న పార్టీ పోలిట్ బ్యూరో సమావేశానికి ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు నందమూరి హరికృష్ణ సోమవారం సాయంత్రం హాజరయ్యారు.
తెలంగాణ ముసాయిదా బిల్లు పైన శాసన సభలో తన అభిప్రాయం చెప్పకుండానే తీర్మానం పేరిట కాంగ్రెసు పార్టీ కొత్త నాటకానికి తెరలేపిందని చంద్రబాబు ఇప్పటికే ఆరోపిస్తున్నారు. మరోవైపు రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో తెలంగాణ ముసాయిదా బిల్లు, బిల్లుపై అసెంబ్లీలో చర్చ, రాజ్యసభ అంశాల పైన ఈ భేటీలో చర్చకు రానుంది. కాగా, రాజ్యసభ ఎన్నికల్లో టిడిపి నుండి ఇద్దరు ఎన్నికయ్యేందుకు అవకాశముంది. రేసులో పలువురు ఉన్నారు. ప్రధానంగా మోత్కుపల్లి నర్సింహులు, గరికపాటి రామ్మోహన రావు, కంభంపాటి రామ్మోహన రావు, సీతామహాలక్ష్మి, ప్రతిభా భారతిలు ఉన్నారు.
నందమూరి హరికృష్ణ పార్టీ పైన, పార్టీ అధినేత పైన అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల ఎన్టీఆర్ వర్ధంతి సమయంలో టిడిపిలో కుటుంబ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. తెలంగాణ విషయంలోను పార్టీ తీరును హరికృష్ణ పరోక్షంగా తప్పు పడుతున్నారు.
రాజ్యసభ కోసం పట్టు
పోలిట్ బ్యూరో సమావేశానికి హరికృష్ణ హాజరు కావడంతో సీను మారిపోయింది. హరికృష్ణ రేసులో ఉండరని అందరూ భావించారు. కానీ, సమావేశంలో ఆయన రాజ్యసభ సీటును కేటాయించాలని పట్టుబట్టుతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో పోలిట్ బ్యూరోలో వాడివేడిగా చర్చ జరుగుతోందని సమాచారం.












Click it and Unblock the Notifications