హెరిటేజ్, చిరు ఫ్యామిలీ సినిమా ఆగిందా: కిరణ్‌పై హరీష్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసన సభ్యుడు హరీష్ రావు సోమవారం నిప్పులు చెరిగారు. ఆయన తెరాస నేతలు హరీశ్వర్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులతో కలిసి తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల పలు కార్యక్రమాలు ఆగాయని చెప్పుకునేందుకు కిరణ్ వచ్చిన రేషన్ కార్డులు, పింఛన్లు, ఉపకార వేతనాలు ఆపేశారని ఆరోపించారు.
గతంలో తెలంగాణ ఉద్యమం సమయంలో పూర్తి భద్రతతో రచ్చబండ నిర్వహించిన కిరణ్, ఇప్పుడు సీమాంధ్ర ఉద్యమం సమయంలో ఎందుకు ఆపేశారో చెప్పాలని ప్రశ్నించారు. సీమాంధ్ర ఉద్యమం వల్ల కార్యక్రమాలు జరగలేకపోతున్నాయని, ఆ ఉద్యమ ప్రభావం బాగా ఉందని చెప్పేందుకే కిరణ్ వచ్చిన రేషన్ కార్డులు, పింఛన్లను ఆపేశారన్నారు. తద్వారా ఈ ప్రభుత్వం రెండు ప్రాంతాల పేదలకు అన్యాయం చేస్తోందన్నారు.
ముఖ్యమంత్రి ఇవాళ ఉండిపోతాడు కానీ, రేషన్ కార్డులు జీవితాంతం ఉంటాయని, అలాంటప్పుడు పేదలకు వాటిని ఇవ్వకుండా అన్యాయం చేస్తారా అని ప్రశ్నించారు. తెలంగాణకో న్యాయం, సీమాంధ్రకో న్యాయమా అని ప్రశ్నించారు. గత రచ్చబండ కార్యక్రమాల్లో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు ముఖ్యమంత్రి నెరవేర్చలేదన్నారు. తెలంగాణ ప్రజలకు ఇప్పటి వరకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వలేదన్నారు. రచ్చబండ పెట్టి 16 నెలలైనా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు.

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చేశామని గొప్పలు చెప్పుకుంటున్న కిరణ్‌కు సీమాంధ్రలో ఉద్యమం పేరిట మూతబడిన హాస్టళ్లు కనిపించడం లేదా అన్నారు. సీమాంధ్రలో కార్పోరేట్ హాస్పిటల్స్ మూతపడలేదని, కేశినేని, దివాకర్ ట్రావెల్స్ బస్సులు ఆగలేదని కానీ, ఆర్టీసి బస్సులు, పేదలకు ఉపయోగపడే ప్రభుత్వ వైద్యశాలలు మూతపడ్డాయన్నారు. ముఖ్యమంత్రి సీమాంధ్ర జెఏసి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారన్నారు.
సీమాంధ్రలో ఉద్యమం జరుగుతుంటే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైళ్లపై సంతకాలు చేయడం ఆపేశారా? టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హెరిటేజ్ పాల ఉత్పత్తి ఆగిందా? కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి కుటుంబ సభ్యుల సినిమాలు ఆగాయా? మంత్రి టిజి వెంకటేష్ కంపెనీల్లో ఉత్పత్తి ఆగిందా? అని ప్రశ్నించారు.
సొల్లు కబుర్లొద్దు: జూపల్లి
తెలంగాణ కాంగ్రెసు నేతలు సొల్లు కబుర్లు చెప్పడం మానుకోవాలని ఎమ్మెల్యే జూపల్లి కృష్ణా రావు మండిపడ్డారు. తెలంగాణను అడ్డుకోవడానికి సీమాంధ్ర పార్టీలు ఏకమయ్యాయన్నారు. తెలంగాణ కాంగ్రెసు నేతలు ఢిల్లీ వెళ్లి తెలంగాణ ప్రక్రియ వేగవంతం కోసం ఒత్తిడి తేవాలన్నారు. హైదరాబాదు పైన ఆంక్షలు విధిస్తే తెలంగాణ కాంగ్రెసు నేతలను తెలంగాణ ప్రజలు జెండాలెక్కిస్తారని, హైదరాబాదును ఎలాంటి పేచీ లేకుండా ఇస్తేనే కాంగ్రెసును ఆదరిస్తారన్నారు.












Click it and Unblock the Notifications