జైరాం వ్యాఖ్య, రాములమ్మ: కాంగ్రెస్‌పై హరీష్ నిప్పులు

ఇది కలిసి ఉండే వారి లక్షణమేనా అని ప్రశ్నించారు. జైరాం వ్యాఖ్యలు తెరాసను, తెలంగాణ ప్రజలను అవమానించడమేనన్నారు. తాము పోలవరం ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తామన్నారు. పలువురు పార్టీ నేతలతో కలిసి గురువారం రాత్రి తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రమంత్రి వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని, అయితే ఆయన మాటలను అధికారికంగా ద్రువీకరించుకోలేదని చెప్పారు.
ఇటీవల కాంగ్రెస్ అనుసరిస్తోన్న తీరు, శైలి బాగా లేదని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అరవింద్ రెడ్డి (మంచిర్యాల), పార్టీ బహిష్కృత ఎంపీ విజయశాంతిని కాంగ్రెస్‌లో చేర్చుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇది దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఓ వైపు కలిసి పని చేద్దామని, కెసిఆర్ మాటపై నిలబడాలని అంటూ చర్చలు సాగిద్దామంటున్నారని, మరోవైపు తెరాస నేతలను పార్టీలో చేర్చుకుంటున్నారని, అసలు కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానం ఏమిటని ప్రశ్నించారు.
ఆ పార్టీ తీరు చూస్తుంటే నోటితో మాట్లాడి, నొసటితో వెక్కిరించినట్లు ఉందన్నారు. రెండు పార్టీల మధ్య వాతావరణాన్ని కలుషితం చేసేలా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఉందని దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్టు కింద ముంపు మండలాలను ఆర్డినెన్స్ ద్వారా సీమాంధ్రలో కలుపుతామంటూ వెలువడుతున్న వార్తలపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాంటి ఆర్డినెన్స్‌ను తెరాస అంగీకరించదని, తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు.
తమ పార్టీ మొదటి నుంచి పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తోందని, డిజైన్‌ను మార్చాలంటోందని, గిరిజనులు, గిరిజన సంస్కృతిని కాపాడాలని అడుగుతోందన్నారు. భద్రాచలం రెవెన్యూ డివిజన్‌లోని మండలాలను సీమాంధ్రలో కలుపుతామంటే ఒప్పుకోబోమని చెప్పారు. అలా చేస్తే భద్రాచంలోని రాములవారి ఆలయానికి వెళ్లే దారి కూడా ఉండదన్నారు. పోలవరాన్ని నిర్మించుకోవడానికి, నీటిని తీసుకెళ్లడానికి తాము వ్యతిరేకం కాదని, కానీ డిజైన్‌ను మార్చాలన్నారు. టిడిపి నుంచి చాలామంది తెరాసలో చేరడానికి ఆసక్తితో ఉన్నారని తెలిపారు.












Click it and Unblock the Notifications