నీ తల్లిదండ్రులకు ఏ రోజైనా రెండు పూటలా భోజనం పెట్టావా?
YS Jagan Mohan Reddy: తన కుటుంబంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తోన్న ఆరోపణలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కుటుంబ బాంధవ్యాలు, మానవత విలువల గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని అన్నారు. రాజకీయాల్లో చంద్రబాబు ఎదిగిన తీరును చూస్తే ఇది ఎవరికైనా స్పష్టంగా అర్థమౌతుందని చెప్పారు.
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్ విలేకరులతో మాట్లాడారు. లక్ష్మీపార్వతి మొదలుకుని తాను, తన కుటుంబం వరకు ఎన్నోఆరోపణలు చేశారని వైఎస్ జగన్ అన్నారు. డైవర్షన్ పాలిటిక్స్‌ను చంద్రబాబు అనుసరిస్తోన్నాడంటూ ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్, విద్యుత్, అప్పులు, రోడ్లు, రాష్ట్ర ప్రగతి, పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలపై ఎన్నో ఆరోపణలు చేశారని, ఎన్నికల తరువాత తిరుమల లడ్డూ సహా అనేక అంశాలతో ప్రజలను దారి మళ్లించే ప్రయత్నం చేస్తోన్నారని ఆరోపించారు.

తల్లి, చెల్లి అంటూ తన కుటుంబాన్ని ఎక్కడపడితే అక్కడ ఆరోపణలు చేశారని జగన్ అన్నారు. చంద్రబాబుకూ ఓ కుటుంబం ఉందని గుర్తు చేశారు. అందరి కుటుంబాల్లోనూ భేదాభిప్రాయాలు ఉంటాయని, తన కుటుంబంలోనూ విబేధాలు ఉండొచ్చని అన్నారు.
సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు గానీ, కుటుంబాలపై గానీ చంద్రబాబు వంటి క్రూరమైన రాజకీయాలు ఎవరూ చేయరని, చంద్రబాబు వంట దుర్మార్గుడు అయితే తప్ప కుటుంబాల జోలికిఎవరూ విషప్రచారం చేయరని జగన్ అన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు తన పార్టీ కేంద్ర కార్యాలయంలో, పార్టీ అధికార ప్రతినిధితో ముఖ్యమంత్రిగా ఉన్న తనను బోసిడికే అని తిట్టించాడని గుర్తు చేశారు.
ఇదే చంద్రబాబు తన చెల్లెలి మీద దుష్ప్రచారం చేయించాడని జగన్ అన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో గల నందమూరి బాలకృష్ణ సొంత టవర్ ఎన్బీకే భవన్ నుంచి వెబ్‌సైట్లల్లో తప్పుడు రాతలు రాయించలేదా?, దుష్ప్రచారం చేయలేదా? పోలీసుల దర్యాప్తులో ఇది తేలలేదా? అని ప్రశ్నించారు.
అప్పట్లో చంద్రబాబుపై షర్మిల చేసిన విమర్శలకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌ను జగన్ ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ప్రదర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో ఇదే చంద్రబాబు వర్రా రవీంద్ర రెడ్డి పేరుతో ఉదయ్ భూషణ్ అనే ఐటీడీపీ సభ్యుడి ద్వారా ఓ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేయించి.. తన చెల్లెలు, తల్లిని తిట్టించాడని జగన్ ఆరోపించారు.
వర్రా రవీంద్ర రెడ్డి పెట్టిన కేసు ఆధారంగా ఫిబ్రవరిలోనే ఉదయ్ భూషణ్ అనే వ్యక్తిని అప్పట్లోనే పోలీసులు ఆధారాలతో సహా అరెస్ట్ చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు అనే వ్యక్తి ఎంత దారుణమైన నికృష్టుడంటే తన స్వార్థం కోసం ఎవరి మీదనైన, ఎలాంటి దుష్ప్రచారం, వ్యక్తిత్వ హననం చేయగలుగుతాడని అన్నాడు.
ఫేక్ ఐడీలను క్రియేట్ చేసి, చంద్రబాబు తన సొంత వ్యక్తులు, సానుభూతిపరుల మీదే తిట్టించగలడని, దాన్ని ప్రత్యర్థులు తిట్టినట్లు ప్రచారం చేస్తాడని అన్నారు. రాక్షసులు అప్పుడప్పుడు పుడతారన్నట్లు చంద్రబాబు వంటి వాళ్లు చాలా అరుదుగా జన్మిస్తుంటారని జగన్ ఎద్దేవా చేశారు. మన ఖర్మ ఏంటంటే అలాంటి వ్యక్తం మన ఏపీలో పుట్టడమేనని అన్నారు.
చంద్రబాబు తన సొంత తల్లిదండ్రులెవరనేది ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించాడా? అని జగన్ ప్రశ్నించారు. మానవత విలువల గురించి మాట్లాడే నైతిక హక్కులు చంద్రబాబుకు లేవని చెప్పారు. తల్లిదండ్రులతో ఎప్పుడైనా కలిసి ఉన్నావా? రాజకీయంగా ఎదిగిన తరువాత తల్లిదండ్రులతో కలిసి రెండు పుటలా ఎప్పుడైనా భోజనం పెట్టి, వారిని సంతోషంగా పంపించావా? అని జగన్ నిలదీశారు.
తల్లిదండ్రులు కాలధర్మం చేస్తే కనీసం వాళ్లకు తలకొరివి అయినా పెట్టావా? అని చంద్రబాబును ప్రశ్నించారు. మానవత విలువలు ఏ మాత్రం లేని వ్యక్తి చంద్రబాబేనని జగన్ పేర్కొన్నారు. రాజకీయాల్లో ఎదగడం కోసం ఏమైనా చేస్తాడని, ఎలాంటి అబద్ధమైనా ఆడతాడని, ఎలాంటి మోసమైనా చేస్తాడని తేల్చి చెప్పారు జగన్. ఇలాంటి వ్యక్తితో తాము యుద్ధం చేస్తోన్నామని, రాష్ట్ర ప్రజలందరికీ ఒకటే కోరుతున్నానని, ఈ యుద్ధంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు.












Click it and Unblock the Notifications