నోరుమూసుకొని కూర్చో: డీకే అరుణ, జైలుకు పంపించలేదు: కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసన సభలో మంగళవారం ఉదయం తీవ్ర రగడ జరిగింది. కాంగ్రెస్, తెరాస ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మధ్య వాగ్వాదం జరిగింది.
నేటి అసెంబ్లీలో లక్ష ఉద్యోగాల హామీపై బీజేపీ, పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్, పోడు భూముల రైతుల విషయంలో ప్రభుత్వ వేధింపులపై సీపీఎం వాయిదా తీర్మానాన్ని ఇచ్చాయి. వాటిని సభాపతి తిరస్కరించారు. ఆ తర్వాత సభ కొనసాగింది.

అయితే, చర్చ సమయంలో డీకే అరుణ మాట్లాడుతుండగా.. తెరాస ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి జోక్యం చేసుకున్నారు. దీంతో డీకే అరుణ ఆగ్రహంతో.. నోరుమూసుకొని కూర్చో అంటూ ఘాటుగా మాట్లాడారు. ఇక్కడ తాము నోరు మూసుకునేందుకు రాలేదని, సమయం ఇస్తే వారి నోరు మూయిస్తామని చెప్పారు. కేసీఆర్ చెబితే నోరు మూస్తారేమోనని ఘాటుగా స్పందించారు. దీనిపై కేటీఆర్ కూడా అదే స్థాయిలో స్పందించారు.
మంత్రిగా పని చేసిన సభ్యులు ఇలా మాట్లాడటం సరికాదని కేటీఆర్ అన్నారు. తమ మంత్రివర్గంలో మహిళలకు చోటు కల్పించడం విషయం పక్కన పెడితే.. మహిళా అధికారులను జైలుకు పంపించే చరిత్ర, మహిళా మంత్రులను సీబీఐ కేసులలో ఇరికించే చరిత్ర తమకు లేదన్నారు. మహబూబ్ నగర్లో వలె దాదాగిరి ఇక్కడ చెల్లదన్నారు. అయితే తాము కొన్ని సమీకరణాల వల్లనే మహిళలకు మంత్రివర్గంలో చోటు ఇవ్వలేదన్నారు.
మరోవైపు, జాతీయ గీతం వివాదంపై వివాదం ముసురుతోంది. వీడియో ఫుటేజీని చూపించాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. దీంతో సాయంత్రం వీడియో ఫుటేజీని చూసేందుకు అధికార పక్షం అంగీకరించింది.
కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష నేత జానా రెడ్డి మాట్లాడుతూ.. జాతీయ గీతం ఆలాపన సందర్భంగా సభలో జరిగిన ఘటన పైన ఇచ్చిన హామీ మేరకు స్పీకర్ చర్యలు తీసుకోవాలన్నారు. దీనికి మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ... జాతీయ గీతాన్ని అవమానించిన వారు ఎవరైనా క్షమాపణ చెప్పాలన్నారు. దీనికి స్పీకర్ స్పందిస్తూ మరోసారి ఫుటేజీని చూస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications