ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్- రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం నమోదు
అమరావతి: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తోన్నాయి. ప్రత్యేకించి- తెలంగాణపై దీని తీవ్రత అధికంగా ఉంటోంది. హైదరాబాద్‌ను ఇప్పటికే అతి భారీ వర్షం ముంచెత్తింది. మరో మూడు రోజుల పాటు ఇవే పరిస్థితులు కొనసాగే అవకాశాలు ఉన్నాయి.
బంగాళాఖాతం వాయవ్య దిశలో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ దిశగా కదులుతూ ఒడిశా, ఛత్తీస్‌గఢ్ దక్షిణ ప్రాంతాల మీదుగా విస్తరించింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రతో పాటు తెలంగాణలో మరో మూడు రోజుల పాటు అంటే 8వ తేదీ వరకు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఏపీలో ఉత్తరాంధ్ర సహా పలు జిల్లాల్లో వచ్చే అయిదు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖపట్నంలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి అనుగుణంగా ఏపీ విపత్తు నిర్వహణ విభాగం అధికారులు ముందు జాగ్రత్త హెచ్చరికలను జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇప్పటికే ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ప్రకాశం జిల్లా ముండ్లమర్రులో అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా ధర్మవరం- 8, నంద్యాల జిల్లా ఆత్మకూరు, డోన్- 6, బాపట్ల జిల్లా కారంచేడులో 5 సెంటీ మీటర్ష వర్షం కురిసింది. రాయలసీమలో పలుచోట్ల, కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల నాలుగు సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది.
విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వివరించింది.
పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చు. పిడుగులు పడే ప్రమాదం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పిడుగులు పడే సమయంలో రైతులు, వ్యవసాయ కూలీలు, గొర్రెల కాపరులు చెట్ల కింద ఉండకూడదని హెచ్చరించింది.












Click it and Unblock the Notifications