చంద్రబాబు, రేవంత్ రెడ్డికి అమిత్ షా ఫోన్: తక్షణ సాయం
న్యూఢిల్లీ: భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. భారీ వర్షాలు, వరదలపై సమీక్షించారు. ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలని, కేంద్రం నుంచి అవసరమైన సాయాన్ని అందిస్తామని తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేంద్రమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు.
వరదల కారణంగా రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. అమిత్ షాకు వివరించారు. ప్రాణనష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ క్రమంలో కేంద్రం నుంచి అన్ని విధాలా సాయం అందజేస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. అదనంగా ఎన్డీఆర్ఎఫ్ బృుందాలను తెలంగాణకు పంపుతున్నట్లు తెలిపారు.

మరోవైపు, ఏపీలో చేపట్టిన వరద సహాయక చర్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హోంమంత్రి అమిత్ షాకు వివరించారు. ఎన్డీఆర్ఎఫ్ ద్వారా పవన్ బోట్లు పంపాలని కోరారు. అవసరమైన మేరకు సాయం చేస్తామని, హోంశాఖ కార్యదర్శి ద్వారా తక్షణ సాయం అందేలా చూస్తామని అమిత్ షా తెలిపారు.
అమిత్ షాతో మాట్లాడాక హోంశాఖ కార్యదర్శితో మాట్లాడారు ఏపీ సీఎం చంద్రబాబు. పవర్ బోట్లను అత్యవసరంగా రాష్ట్రానికి పంపాలని కోరారు. దీంతో 6 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెంటనే పంపుతున్నామని కేంద్ర హోంశాఖ తెలిపింది. ఒక్కో ఎన్డీఆర్ఎఫ్ బృందంలో 25 మంది ఉంటారని తెలిపింది. సోమవారం ఉదయంలోగా పవర్ బోట్లు విజయవాడ చేరుకుంటాయని పేర్కొంది. మొత్తం 40 పవర్ బోట్లు రాష్ట్రానికి పంపుతున్నామని తెలిపింది.సోమవారం వాయుమార్గంలో 4 ఎన్డీఆర్ఎఫ్ టీమ్‌లు పంపుతున్నామని,
సహాయ చర్యల కోసం 6 హెలికాప్టర్లు పంపుతున్నామన్న కేంద్ర హోంశాఖ వెల్లడించింది.
కాగా, ఏపీ, తెలంగాణలో కురుస్తున్న వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటి వరకు వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో పది మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో వ్యక్తులు వరదల్లో గల్లంతయ్యారు. ఏపీ, తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. తెలంగాణలో హైదరాబాద్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలతో అనేక ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. ఏపీలో విజయవాడతోపాటు కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో అనేక ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ప్రజలకు అండగా ఉంటామని చెబుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.












Click it and Unblock the Notifications