వైసీపీలో పుత్తా, హర్షలకు కీలక పదవులు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించింది. పార్టీలో చురుగ్గా పనిచేసే యువ నాయకులకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తింపు ఇస్తోన్నారు. కీలక బాధ్యతలను అప్పగిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర స్థాయిలో పార్టీ కమిటీలను బలోపేతం చేసేందుకు తాజాగా కీలక నియామకాలు చేపట్టారు. ఇద్దరు ముఖ్య నేతలను వైఎస్ఆర్సీపీ డిప్యూటీ జనరల్ సెక్రటరీలుగా నియమిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.
ఈ క్రమంలో గుంటూరు, కడప జిల్లాలకు చెందిన ఇద్దరు కీలక నాయకులకు ఈ రాష్ట్ర స్థాయి పదవులు దక్కాయి. ఈ తాజా నియామకాల్లో గుంటూరు జిల్లాలోని తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఏ హర్షవర్ధన్‌కు కీలక బాధ్యత దక్కింది. పార్టీ కోసం పనిచేస్తున్న ఆయన సేవలను గుర్తించిన అధిష్టానం.. ఆయనను పార్టీ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీగా నియమించింది. నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొనేలా ఈ బాధ్యతలు అప్పగించారు.

మరోవైపు కడప జిల్లా కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పుత్తా శివ శంకర్ కూడా ఈ కీలక పదవికి ఎంపికయ్యారు. శివ శంకర్‌ను పార్టీ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీగా నియమిస్తూ వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. కమలాపురం నియోజకవర్గంలో బలమైన క్యాడర్‌ను సమన్వయం చేసుకుంటూ, పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన ముఖ్యపాత్ర పోషిస్తారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.
భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు, ప్రజలతో నిరంతరం అనుసంధానమై ఉండేందుకు వీలుగా క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలను పునర్‌వ్యవస్థీకరిస్తున్నారు. పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికీ తగిన ప్రాధాన్యత ఉంటుందని ఈ నియామకాల ద్వారా స్పష్టమవుతోంది. ముఖ్యంగా యువ, చురుకైన నాయకత్వానికి ఈ కమిటీల్లో పెద్దపీట వేస్తున్నారు వైఎస్ జగన్. హర్షవర్ధన్, పుత్తా శివ శంకర్ ఇద్దరూ తమ నియోజకవర్గాల్లో పట్టున్న నాయకులుగా పేరు తెచ్చుకున్నారు.
ఆయా జిల్లాల్లో పార్టీ శ్రేణులను సమన్వయం చేయడంలో, ప్రజా సమస్యలపై పోరాడటంలో ఈ కొత్త నాయకత్వం కీలక పాత్ర పోషించనుంది. భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ చేపట్టబోయే ప్రజా అజెండా కార్యక్రమాలను విజయవంతం చేయడానికి ఈ నియామకాలు దోహదపడతాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ దిశగా పార్టీ యువ క్యాడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు అధిష్టానం మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications