తిరుపతితో పాటు అక్కడ భారీ వర్షాలు.. హెచ్చరించిన ఐఎండీ!
నవంబర్ మాసంలో ఒకపక్క చలి పులి వేధిస్తుంటే, మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వర్షాలు వదలడం లేదు. వర్షాల కారణంగా ఏపీలో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇంకోపక్క చలిగాలుల తీవ్రత పెరగడంతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.
ఈ జిల్లాలలో నేడు వర్షాలు
నైరుతి బంగాళాఖాతం తీర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా నేడు ఏపీలోని నెల్లూరు, తిరుపతి జిల్లాలలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. వర్షాలు కురిసే జిల్లాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35 కిలోమీటర్ల వేగం నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. నేడు అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా ప్రజలు వర్షాలు కురిసే సమయంలో బయటకు వెళ్లకుండా ఉంటే మంచిదని వెల్లడించింది. అంతేకాదు మత్స్యకారులు ఎవరు సముద్రంలోకి వేటకు వెళ్ళకూడదని సూచించింది.
దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
దక్షిణ ఆంధ్రప్రదేశ్ పైన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని మూడురోజుల పాటు దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం కూడా పేర్కొంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల మొంథా తుఫాను ప్రభావంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అకాల వర్షాల కారణంగా ఆరుగాలం శ్రమించి పంటలు పండించిన రైతన్నలు లబోదిబోమంటున్నారు.
అకాల వర్షాలు, చలితో వీరు జాగ్రత్త
మళ్లీ ఇప్పుడు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్లో కురుస్తున్న అకాల వర్షాల కారణంగా ఏపీలో చలి తీవ్రత కూడా విపరీతంగా పెరిగింది. అకాల వర్షాలతో, మారిన వాతావరణ పరిస్థితులతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు రోగ పీడితులుగా మారుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.












Click it and Unblock the Notifications