బంగాళాఖాతంలో బలపడ్డ అల్పపీడనం: ఏపీలో భారీ వర్షాలు- మత్స్యకారులకు సూచనలు
Bay of Bengal: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల ఏపీలో భారీ వర్షాలు కురుస్తోన్నాయి. ఉత్తరాంధ్ర సహా, ఏపీ దక్షిణ తీర ప్రాంత జిల్లాలు, రాయలసీమలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షపాతం నమోదవుతోంది. ఇదే పరిస్థితి మరో మూడు రోజుల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయి.
ఈ ఉపరితల ఆవర్తనం బలపడింది. అల్పపీడనంగా రూపాంతరం చెందింది. ప్రస్తుతం బంగాళాఖాతం ఉత్తరప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. వచ్చే 24 గంటల్లో ఇది వాయవ్య దిశగా కదులుతుందని, మరింత బలపడటానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది.

వచ్చే 48 గంటల్లో ఈ అల్పపీడనం క్రమంగా పశ్చిమ బెంగాల్, ఒడిశా ఉత్తర ప్రాంతం వైపు కదిలేందుకు అవకాశం ఉంది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో ఆదివారం వరకు అక్కడక్కడ భారీ వర్షాలు నమోదు కావడానికి అవకాశం ఉందని ఎస్డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని సూచించారు.
పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ప్రఖర్ జైన్ పేర్కొన్నారు.
విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపారు. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసేందుకు ఆస్కారం ఉందని వివరించారు.
ఇప్పటివరకు పలు జిల్లాల్లో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కర్నూలు, తిరుపతి, అన్నమయ్య రాయచోటి జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తారు వర్షాలు కురిశాయి.
రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ బలమైన ఈదురుగాలులు వీచే అవకాశాలు లేకపోలేదని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఈదురు గాలులు వీచే సమయంలో ప్రజలు హోర్డింగులు, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు వంటి ప్రదేశాల వద్ద నిల్చోకూడదని విజ్ఞప్తి చేశారు. అలాగే- పిడుగులు పడే సమయంలో బహిరంగ ప్రదేశాలు, చెట్ల కింద తలదాచుకోవద్దని ప్రఖర్ జైన్ సూచించారు.












Click it and Unblock the Notifications