ఏపీ ప్రజలకు హెచ్చరిక... ఉరుములు, పిడుగులు
పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తులు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా శ్రీకాకుళం, మన్యం, అల్లూరి జిల్లాల్లో ఉధృతంగా పిడుగులు పడే అవకాశం ఉందని, పొలాల్లో పనికి వెళ్లే రైతులు, రైతు కూలీలు, గొర్రెల కాపరులు చెట్ల కింద ఉండొద్దని హెచ్చరించింది. ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని సంస్థ సూచించింది.
పిడుగులు పడే అవకాశమున్న ప్రాంతాలు: శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస మండలాలతోపాటు పార్వతీపురం మన్యం జిల్లాలో గుమ్మలక్ష్మీపురం, పార్వతీపురం, సాలూరు, మక్కువ, పాచిపెంట, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అనంతగిరి, అరకులోయ, జీకే వీధి, కొయ్యూరు మండల్లాలో పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు విపత్తులు నిర్వహణ సంస్థ తెలియజేసింది.

రాష్ట్రంలో వాతావరణం: నైరుతి రుతుపవనాలు రాబోయే రెండు రోజుల్లో దక్షిణ బంగాళాఖాతం, అండమాన సముద్రంతోపాటు అండమాన్ నికోబార్ దీవుల్లోని మరికొన్ని ప్రాంతాలకు ముందుకు సాగడానికి అనుకూలంగా ఉన్నాయి. ఉత్తర-దక్షిణ ద్రోణి ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుండి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు, విదర్భ, ఉత్తర అంతర్గత కర్ణాటక మీదగా సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉంది. ఏపీ, యానాంలో దిగువ ట్రోపోస్పిరిక్ స్థాయిలలో నైరుతి గాలులు వీస్తున్నాయి.
గురువారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ తెలియజేసింది. ఒకటి రెండు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన మెరుపులు సంభవిస్తాయని తెలిపింది. రాయలసీమలో ఒకటి రెండు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు వీస్తాయి. శుక్రవారం వాతావరణం పొడిగా ఉండటంతోపాటు ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు పెరుగుతాయి.












Click it and Unblock the Notifications