గుంటూర్1లో పోటీ చేస్తా!: బాబుతో అలీ, గంటా రుసరుస
హైదరాబాద్: ప్రముఖ టాలీవుడ్ హాస్య నటుడు అలీ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లుగా కొంతకాలంగా ఊహాగానాలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అలీ ఈ విషయాన్ని టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకు వెళ్లారట.
తనకు రానున్న సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేయాలనే ఆసక్తి ఉందని చంద్రబాబు దృష్టికి అలీ తీసుకు వెళ్లినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆయనను గుంటూరు 1 స్థానం నుండి బరిలోకి దింపే విషయమై పార్టీ అధిష్టానం ఆలోచిస్తుందని తెలుస్తోంది.

అలీ టిడిపి సానుభూతిపరుడు. ఆయన గతంలో ఆ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గుంటూరు-1 సీటుకు పరిశీలిస్తున్నారు. ముస్లిం మైనారిటీలు గణనీయ సంఖ్యలో ఉన్న ఆ సీటుకు ఆ వర్గాల నుంచి ఎవరినైనా నిలపాలని టిడిపి భావిస్తోంది. దివంగత టిడిపి నేత లాల్‌జాన్ బాషా సోదరుడు గతంలో ఆ సీటుకు ప్రాతినిధ్యం వహించారు. కానీ, ఇప్పుడు ఆయన కంటే మెరుగైన అభ్యర్థి కోసం టిడిపి అన్వేషిస్తోంది. అలీ ప్రత్యామ్నాయంగా దొరికినట్లుగా తెలుస్తోంది.
అలీతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ప్రముఖ నటుడు సుమన్ కూడా రేపల్లె నుండి పోటీ చేయవచ్చునని వినికిడి. గుంటూరు-2 సీటుకు టిడిపి తరఫున తాజాగా నటుడు కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు పేరు ప్రచారంలోకి వచ్చింది. గుంటూరు-2 సీటుకు నటి కవిత పేరు కూడా పరిశీలనలో ఉందట.
గంటా వర్గం మనస్తాపం, గుర్రు
టిడిపి సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు తన పైన పరోక్షంగా చేసిన వ్యాఖ్యల పైన మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు, ఆయన వర్గం తీవ్ర మనస్తాపానికి గురయింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు సమీక్షకు గంటా వర్గం డుమ్మా కొట్టింది. గంటా టిడిపిలో బుధవారం చేరారు. గంటకో పార్టీ మారవద్దంటూ అయ్యన్న నిన్నటి సభలో పరోక్షంగా గంటాను ఉద్దేశించి అన్నారు. దీనిపై గంటా మనస్తాపానికి గురయ్యారు. అయ్యన్న పైన రుసరుసలాడుతున్నారు.












Click it and Unblock the Notifications