బాబుకు షాక్: ఏం చెప్తున్నారు.. సుజనకు హీరో శివాజీ సూటి ప్రశ్న
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీ నేత, ప్రముఖ నటుడు శివాజీ ఆదివారం గట్టి షాకిచ్చారు. కేంద్రమంత్రి సుజనా చౌదరి వ్యాఖ్యల పైన హీరో శివాజీ నిలదీశారు. ప్రజలను మభ్య పెట్టే ప్రకటనలు చేయవద్దని, కేంద్రం రూ.10వేల కోట్లు ఇస్తుందని సుజన చెప్పారని, ఎందుకు, ఎలా ఇస్తున్నారో స్పష్టంగా చెప్పాలని ప్రశ్నల వర్షం కురిపించారు.
పార్టీలు, రాజకీయ నాయకులు ప్రజలను మభ్య పెట్టే ప్రకటనలకు దూరంగా ఉండాలని హితవు పలికారు. ప్రజలను మభ్య పెట్టాలని చూస్తే నాయకులు చరిత్రహీనులు అవుతారని మండిపడ్డారు. సుజన చెప్పిన పదివేల కోట్లు ఎక్కడి నుండి వస్తున్నాయి, ఎప్పుడు వస్తున్నాయో, ఏ రూపంలో వస్తున్నాయో చెప్పాలన్నారు. ఈ నిధులు ఎందుకు ఇస్తున్నారో చెప్పాలన్నారు. ఏపీ ఇప్పుడు ఇబ్బందుల్లో ఉందని, ఇలాంటి సమయంలో రాజకీయాలు వద్దని హితవు పలికారు.
అన్ని పార్టీలు ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేందుకు కృషి చేయాలన్నారు. ఏపీ ఈ రోజు కుక్కలు చింపిన విస్తరిలా తయారయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకున్నారని, వారి సెంటిమెంట్ గుర్తించి తెలంగాణ ఇచ్చారని, అందులో తప్పులేదని అభిప్రాయపడ్డారు. అయితే, విభజనను ఏపీ ప్రజలు కోరుకోలేదని, ఇలాంటి పరిస్థితుల్లో ఏపీకి న్యాయం చేయాల్సిన బాధ్యత పార్టీల పైన ఉందని చెప్పారు.

విభజన సమయంలో... రాజ్యసభలో ప్రతిపక్ష నాయకులు ఇచ్చిన హామీల గురించి ఆలోచించాలని హితవు పలికారు. ఏపీ ఇబ్బందుల్లో ఉన్నందున.. ఇంతకుముందు రాజకీయ నాయకుల్లా కాకుండా రాష్ట్రానికి మంచి చేసేలా కృషి చేయాలన్నారు. నాయకులు కూడా ప్రజలను తక్కువగా అంచనా వేయవద్దని కోరారు. విభజించేటప్పుడు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ తదితర పార్టీలు ఏపీ కోసం గొంతు చించుకున్నాయని గుర్తు చేశారు.
ఇప్పుడు మాత్రం ఎవరు మాట్లాడటం లేదని, పైగా బీజేపీని వేలెత్తి చూపించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఇచ్చిన హామీలను నిలబెట్టే దిశలో ప్రయత్నాలు చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ మంది రాజ్యసభ సభ్యులు ఉన్నప్పటికీ హామీల కోసం ఎందుకు అడగటం లేదని ప్రశ్నించారు. స్వప్రయోజనాల కోసం కాకుండా ప్రజల కోసం ఆలోచించాలన్నారు.
సుజనా చౌదరి చెబుతున్న పదివేల కోట్ల రూపాయలు మనకు బిక్షం వేయడం లేదని, అది మన హక్కు అన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు ఆయా పార్టీలు, నేతలు కట్టుబడి ఉండాలన్నారు. అమలు చేయగలిగే హామీలను మాత్రమే ఇవ్వాలని టీడీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications