మణికంఠ కుటుంబానికి హీరో శివాజీ ఆర్ధిక సాయం
విజయవాడ: ఇటీవల హోలీ రోజున విజయవాడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మణికంఠ అనే యువకుడి బ్రెయిన్ డెడ్ అవడంతో అతడి అవయవాలను అతడి కుటుంబ సభ్యులు దానం చేసిన విషయం తెలిసిందే. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది మనసుల్ని కలచివేసింది.
అంతేకాదు ఈ సంఘటనపై చాలా మంది స్పందించారు కూడా. తాజాగా మణికంఠ తల్లి, సోదరిని సినీ హీరో, బీజేపీ నేత శివాజీ విజయవాడలో పరామర్శించారు. ఈ సందర్భంగా వారికి రూ. లక్ష ఆర్ధిక సాయంగా అందించాడు.
వారి కుటుంబానికి ప్రతి ఏడాది కొంత ఆర్ధిక సాయం అందజేస్తానని శివాజీ చెప్పారు. మణికంఠ తల్లిని సొంత తల్లిలా చూసుకుంటానని, వారి బాగోగులు చూస్తానని అన్నారు. అవయవదాన చేసిన మణికంఠ కుటుంబాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మణికంఠ కుటుంబానికి ఎన్నారై ఆసుపత్రి యాజమాన్యం తరఫున సీఈవో కోనేరు శ్రీధర్, కార్యదర్శి డాక్టర్ మంతెన నరసరాజు రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని గతంలోనే ప్రకటించారు.
మణికంఠ దానం చేసిన గుండెను.. చెన్నైలోని ఫోర్టీస్ ఆస్పత్రి వైద్యులు ముంబైకి చెందిన 20 ఏళ్ల కుర్రాడికి అమర్చారు. కాలేయాన్ని హైదరాబాద్ గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కూకట్‌పల్లికి చెందిన 47 ఏళ్ల వ్యక్తితి అమర్చారు.
రెండు మూత్ర పిండాల్లో ఒకదానిని గుంటూరు సిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తికి అమర్చగా, రెండో దాన్ని మంగళగిరి ఎన్నారై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తికి అమర్చిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications