తెలంగాణ నూతన సీఎస్ ఖరార్: కేంద్రం నుంచి: రేవంత్ ఏరికోరి.. !!
తెలంగాణ ప్రభుత్వ పరిపాలన యంత్రాంగంలో అత్యున్నత స్థాయిలో కీలక మార్పు సంభవించబోతోంది. రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత సీఎస్ కే రామకృష్ణారావు సుదీర్ఘ పదవీ కాలం ఈ నెల 30వ తేదీతో ముగియనుంది. అదే రోజున సంజయ్ జాజు బాధ్యతలను స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారికంగా ఉత్తర్వులు ఇంకా వెలువడాల్సి ఉంది.
1992 బ్యాచ్, ఉమ్మడి ఏపీ క్యాడర్ సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు. విభజన సమయంలో తెలంగాణకు వెళ్లారు. ప్రస్తుతం డెప్యుటేషన్ పై కేంద్రంలో పని చేస్తోన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు డీఓపీటీ ఆయనను మాతృ క్యాడర్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావు పదవీ విరమణకు వారం ముందే కేంద్ర క్యాబినెట్ నియామకాల కమిటీ ఈ బదిలీ ప్రక్రియను పూర్తి చేసింది.

దాదాపు 13 ఏళ్ల సుదీర్ఘ సమయం తర్వాత సంజయ్ జాజు తిరిగి మాతృ రాష్ట్ర సర్వీసుల్లో చేరబోతున్నారు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా. సంజయ్ జాజుకు కేంద్ర స్థాయిలోని వివిధ కీలక శాఖల్లో వివిధ హోదాల్లో పని చేసిన అనుభవం ఉంది. 13 సంవత్సరాల పాటు పలు మంత్రిత్వ శాఖల్లో ఉన్నత పదవులు నిర్వహించారు. కేంద్ర సమాచార, ప్రసారాలు, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ కార్యదర్శిగా పని చేశారు. ఉమ్మడి ఏపీలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌గా, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా పనిచేసి సమర్థుడిగా గుర్తింపు పొందారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా సంజయ్ జాజు వైపు మొగ్గు చూపినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం మౌలిక వసతుల ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించింది. మూసీ నది పునరుజ్జీవనం, హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రైల్, నూతన గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలు, ప్రతిపాదిత బుల్లెట్ రైలు కారిడార్ల అభివృద్ధి, అలాగే భారత్ ఫ్యూచర్ సిటీ వంటి భారీ ప్రాజెక్టులకు కేంద్ర నిధులు, అనుమతులు సాధించాల్సి ఉంది.
ఈ మెగా ప్రాజెక్టుల పురోగతికి ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ విభాగాలు, విభిన్న మంత్రిత్వ శాఖల నుంచి త్వరితగతిన అనుమతులు సాధించడం ఎంతో కీలకం. ఢిల్లీ అధికార వర్గాల్లో మంచి సమన్వయం, విస్తృత పరిచయాలు కలిగిన సంజయ్ జాజు అయితేనే ఈ బాధ్యతలకు అత్యంత యోగ్యుడని రేవంత్ రెడ్డి భావిస్తోన్నారు. సీఎస్ రేసులో అనుభవజ్ఞులైన ఉన్నతాధికారులు జయేష్ రంజన్, వికాస్ రాజ్ పేర్లు పరిశీలనకు వచ్చినప్పటికీ, రేవంత్ రెడ్డి చివరకు కేంద్ర స్థాయి అనుభవం ఉన్న జాజు వైపే మొగ్గు చూపారు.
నూతనంగా బాధ్యతలు చేపట్టనున్న సంజయ్ జాజు 2028 మార్చి వరకు ఈ కీలక పదవిలో కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు.. ప్రస్తుత సీఎస్ కే. రామకృష్ణారావు పదవీ విరమణతో తెలంగాణ బ్యూరోక్రసీలో ఒక సుదీర్ఘ అధ్యాయం ముగియనుంది. నిజానికి ఆయన గత ఏడాది ఆగస్టులోనే పదవీ విరమణ చేయాల్సి ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్రం రెండు విడతలుగా ఆయన సర్వీస్‌ను పొడిగించింది. ఈ నెలాఖరుతో ఆయన పదవీ కాలం ముగియనుంది.












Click it and Unblock the Notifications