CYCLONE JAWAD : నేడు తుపానుగా - 95 రైళ్ల రద్దు : అధికారుల అప్రమత్తం -వెనక్కు వెళ్లిన సముద్రం..!!
ఉత్తరాంధ్రపై తుఫాను ముంచుకొస్తోంది. రాయలసీమ జిల్లాల్లో జరిగిన నష్టం నుంచి ఇంకా తేరుకోక ముందే ఇప్పుడు ఉత్తరాంధ్రలో తుఫాను ముప్పు టెన్షన్ పుట్టిస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. విశాఖకు 960 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న ఈ వాయుగుండం మరింత బలపడి శుక్రవారం మధ్య బంగాఖాళాతంలో జవాద్ తుపానుగా మారుతుందని విపత్తుల నిర్వహణశాఖ కమిషనర్ కె.కన్నబాబు, విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు వెల్లడించారు.

ఉత్తరాంధ్ర జిల్లాలపై తుఫాను
ఈ సాయంత్రం నుంచే దీని ప్రభావం కనిపించే అవకాశం ఉంది. ఇది తరువాత వాయవ్య దిశలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరం వరకు ప్రయాణించి శనివారం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు చేరే అవకాశం ఉందని తెలిపారు. దీని ప్రభావంతో 2రోజుల పాటు ఉత్తరాంధ్రలో పలుచోట్ల మోస్తారు వర్షాలు, అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. శుక్రవారం అర్థరాత్రి నుంచి తీరం వెంబడి గంటకు 45-65 కిలోమీటర్లు, శనివారం 70-90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. మత్స్యకారులు సోమవారం వరకు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.

95 రైళ్లు రద్దు చేసిన అధికారులు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. ఇక, జవాద్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో గురు, శుక్ర, శనివారాల్లో 95 రైళ్లను నిలిపివేస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే ఖుర్ధా డివిజన్ కార్యాలయం స్పష్టం చేసింది. ఇందులో విజయవాడ మీదుగా ప్రయాణించే 41 ఎక్స్‌ప్రెస్ రైళ్లున్నాయి. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఉత్తరాంధ్ర మూడు జిల్లాల కలెక్టర్లను సీఎం జగన్ ఆదేశించారు. ఉత్తరాంధ్రకు తుపాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లు, సీఎంవో కార్యాలయ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

సీఎం ఆదేశాలు..అధికారులు అప్రమత్తం
అవసరమైన చోట్ల సహాయ శిబిరాలు తెరిచేందుకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకోవాలని నిర్దేశించారు. లోతట్టు, ముంపు ప్రాంతాలు ఉంటే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుపాన్ వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితుల వల్ల ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా చూడాలని చెప్పారు. ఉత్తరాంధ్రలో తుపాను సహాయ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే బాధ్యతను ముగ్గురు సీనియర్ అధికారులకు అప్పగించారు. శ్రీకాకుళం జిల్లాకు హెచ్.అరుణ్‌కుమార్, విజయనగరం జిల్లాకు కాంతిలాల్‌దండే, విశాఖ జిల్లాకు శ్యామలరావును నియమించారు.
Recommended Video

జిల్లాలకు చేరుకున్న ప్రత్యేకాధికారులు
వెంటనే ఆయా జిల్లాలకు చేరుకుని తుపాను సహాయ కార్యక్రమాల సమన్వయ, పర్యవేక్షణ బాధ్యతలు స్వీకరించాలని ఆదేశించారు. ఇక, తుఫాను సమయాల్లో సముద్రం ముందుకు వస్తుంటుంది. ఇందుకు భిన్నంగా విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం గ్రామం వద్ద గురువారం వంద మీటర్లు వెనక్కు వెళ్లింది. ఇది గమనించిన మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. పౌర్ణమి, అమావాస్యల సమయాల్లోనే ఈ విధంగా జరుగుతుంటుందని, తుఫాన్ సమయంలో ఇలా జరగడం ఇదే మొదటిసారని చెబుతున్నారు. దీంతో...మూడు జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది. కేంద్ర ప్రభుత్వం సైతం ఈ తుఫాను కదలికల పైన ఆరా తీస్తోంది. అప్రమత్తంగా ఉండాలని సూచించింది.












Click it and Unblock the Notifications