చంద్రబాబుకు హైకోర్టులో బెయిల్ మంజూరు..!!
తెలుగుదేశం అధినేత చంద్రబాబు కు మరో కేసులో ఊరట దక్కింది. అంగల్లు కేసులో చంద్రబాబుకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఇప్పటికే వాదనలు పూర్తి కావటంతో తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు ఈ రోజు తీర్పు వెల్లడించింది. చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు అంగీకరిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ కేసులో ఇప్పటికే చాలామందికి బెయిల్ మంజూరు అయిందని..ఇందులో చంద్రాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాదులు కోరారు.
చంద్రబాబుకు ఊరట:చంద్రబాబుకు అంగల్లు కేసులో ఉపశమనం లభించింది. ఆగస్టు 4న అంగల్లు మీదుగా చంద్రబాబు వెళ్తున్న సమయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆ సమయంలో జరిగిన ఘర్షణల్లో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. ఈ ఘటనలో చంద్రబాబుతో సహా 179 మంది పైన కేసులు నమోదయ్యాయి. దీని పైన పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించగా విచారణ తరువాత కొందరికి బెయిల్ మంజూరు అయింది. ఇప్పుడు స్కిల్ స్కాంలో రాజమండ్రి జైలులో రిమాండ్ లో ఉన్న చంద్రబాబు ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు. కొందరు చంద్రబాబు పైనే రాళ్లు రువ్వారని వాదనల్లో కోర్టుకు వివరించారు. చంద్రబాబు కు రక్షణగా ఉన్న ఎన్ఎస్జీ సిబ్బంది కాపాడారని చెప్పుకొచ్చారు.

సుప్రీంలో క్వాష్ విచారణ:ఈ పిటీషన్ పై వాదనలు విన్న న్యాయమూర్తి చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసారు. ఇక..స్కిల్ స్కాం కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం ఉంది. స్కిల్ కేసులో చంద్రబాబు సుప్రీంలో దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ పైన ఈ రోజు విచారణ కొనసాగనుంది. 17ఏ ఆధారంగా ఇక్కడ ప్రధానంగా వాదనలు జరుగుతున్నాయి. చంద్రబాబు క్వాష్ పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానంలో జరిగిన విచారణలో బాబు తరపున సీనియర్ అడ్వకేట్ హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. ఆ తర్వాత సిద్ధార్థ లుథ్రా, అభిషేక సింఘ్వీ కూడా వాదనలు వినిపించారు. తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్ కొట్టేయాలని, జ్యుడిషియల్ రిమాండ్ రద్దు చేయాలని, విచారణ నిలిపివేయాలని బాబు పిటిషన్‌లో పేర్కొన్నారు. గవర్నర్ అనుమతి లేకుండా అవినీతి నిరోధక చట్టం 17ఏ ప్రకారం విచారణ ప్రక్రియ చెల్లదని సాల్వే వాదించారు.
17ఏ పైనే ప్రధానంగా వాదనలు:ఇప్పటి వరకు మూడు విడతలుగా సుప్రీంలో ఇదే అంశం చుట్టూ వాదనలు జరిగాయి. 2021 డిసెంబర్ 9న స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో విచారణ ప్రారంభమైందని సాల్వే వివరించారు. అదే సమయంలో సెక్షన్ 17ఏలో స్పష్టమైన నిర్వచనం ఇచ్చారని, అధికార దుర్వినియోగం విషయంలో చట్టంలో స్పష్టమైన నిర్వచనం ఉందని, కక్ష సాధింపులో భాగంగానే కేసులు నమోదు చేశారని సాల్వే ధర్మసనానికి వివరించారు. సెక్షన్ 17ఏను 2018జులైకు ముందు జరిగిన నేరాలకు వర్తింపచేయడంలో అర్థం లేదని సాల్వే వాదించారు. మరోవైపు ఏపీ సిఐడి తరపున హాజరైన ముఖుల్ రోహత్గీ చంద్రబాబు వ్యవహారంలో 17ఏ ప్రశ్న తలెత్తదని స్పష్టం చేశారు. దీంతో, ఈ రోజు సుప్రీంలో జరిగే వాదనలు..నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications