ఆంధ్రప్రదేశ్ లో పరిపాలనపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు...మెయిన్ మీడియాలో నో కవరేజి...

Posted By: Suvarnaraju
Subscribe to Oneindia Telugu
  High Court has made Sensational Comments on Ap Government | Oneindia Telugu

  అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన గురించి హైకోర్టు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసింది. విదేశాల్లో ఎపి ముఖ్యమంత్రి పెట్టుబడులే లక్ష్యంగా పర్యటనలు జరుపుతున్న నేపథ్యంలో హై కోర్టు వ్యాఖ్యలు ఎపి గవర్నమెంట్ ప్రతిష్టకు పెద్ద దెబ్బే. అంతే కాదు హైకోర్టు వ్యాఖ్యలను ఎపి ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని దిద్దుబాటు చర్యలను యుధ్ద ప్రాతిపదికన మొదలుపెట్టాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి. ఇంతకీ అసలు హైకోర్టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ను ఏమంది? ఏ విషయంలో వ్యాఖ్యలు చేసింది? ఆ వివరాలు తెలుసుకుందాం..

   హైకోర్టు ఏమందంటే...

  హైకోర్టు ఏమందంటే...

  ఒక కేసు విచారణ సమయంలో హై కోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. అసలు ఇలా అయితే రాష్ట్రానికి ఒక్క పెట్టుబడి కూడా వచ్చే అవకాశం లేదని ఆవేదన చెందింది. పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చిన కంపెనీలకు భూబదలాయింపు చేయకుండా వేధించడం, తిరిగి భూమి స్వాధీనం చేసుకుంటామని ఎపి ప్రభుత్వం హెచ్చరించడంపై హైకోర్టు తీవ్రంగా ప్రతిస్పందించింది.

   ఎపిలో పాలనపై...

  ఎపిలో పాలనపై...

  ఏపీలో పరిపాలన మొత్తం గందరగోళంగా తయారైందని హైకోర్టు న్యాయమూర్తి రామచంద్రరావు వ్యాఖ్యానించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ నుంచి వరుసగా తమ ముందుకు వస్తున్న కేసులను పరిశీలిస్తే అక్కడి పరిస్థితులు ఏంటో అర్థమవుతోందని న్యాయమూర్తి అన్నారు. ఎపిలో పరిపాలనపై హైకోర్టు న్యాయమూర్తి రామచంద్రరావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో పాలన చూస్తుంటే గుండె దహించుకుపోతోందని జస్టిస్ రామచంద్రరావు ఆవేదన చెందారు. ఏపీలో పాలన ఒక పద్దతి, పాడు లేకుండా తయారైందన్నారు.

   ఏ కేసుకు సంబంధించి...

  ఏ కేసుకు సంబంధించి...

  అయితే హై కోర్టు ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏమిటి? ఏ కేసుకు సంబంధించి ఈ వ్యాఖ్యలు చేసిందంటే...నెల్లూరు జిల్లా, వెంకటగిరి మండలం, చెవిరెడ్డిపల్లి గ్రామం, సర్వే నంబర్‌ 105లో స్పిన్నింగ్‌ మిల్లు ఏర్పాటు నిమిత్తం ఎస్కో కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం 1991లో మార్కెట్‌ ధరపై 30 ఎకరాల భూమిని బదలాయించింది. దీంతో ఆ కంపెనీ మిల్లు ఏర్పాటుకు అవసరమైన అనుమతుల కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం భూ బదలాయింపును తాత్కాలికంగా నిలిపేస్తూ 1992లో ఉత్తర్వులిచ్చింది. ఐదేళ్ల తర్వాత 1997లో మళ్లీ ఆ ఉత్తర్వులను రద్దు చేసింది. దీంతో ఆ కంపెనీ ఏపీఐఐసీ, ఏపీఎస్‌ఎఫ్‌సీలను ఆశ్రయించి తిరిగి రుణం తీసుకునే ప్రయత్నాలను మొదలు పెట్టింది. అయితే కేటాయించిన భూమి తాలూకు ఒరిజినల్‌ డాక్యుమెంట్లు తీసుకురావాల్సిందిగా ఏపీఎస్‌ఎఫ్‌సీ అధికారులు కోరారు. ఆ విధంగా డాక్యుమెంట్లు ఇచ్చేందుకు జిల్లా కలెక్టర్‌ ఆదేశించినా రికార్డుల్లో కంపెనీ పేరు చేర్చి మార్పులు చేయడానికి ఎమ్మార్వో నిరాకరించారు. దీంతో రుణం అందక ఆ కంపెనీ స్పిన్నింగ్‌ మిల్లు ఏర్పాటు పనులను నిలిపేసింది. 2016లో ఎస్కో కంపెనీకి ఎపి అధికారులు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. పరిశ్రమ ఏర్పాటు చేయనందున భూమిని ఎందుకు స్వాధీనం చేసుకోరాదో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. కంపెనీ ఇచ్చిన వివరణను పట్టించుకోకుండా ఆ భూమిని వెంకటగిరి మునిసిపాలిటీకి అప్పగించేశారు.పైగా ఇందుకు సంబంధించి ఎస్కో కంపెనీకి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. దీంతో ఎస్కో తమకు కేటాయించిన భూమిని తిరిగి తమకు స్వాధీనం చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హై కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

   ఎపి ప్రభుత్వ వాదన...

  ఎపి ప్రభుత్వ వాదన...

  అయితే ఎపి ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు. పిటిషనర్‌ ఏళ్ల తరబడి మౌనంగా ఉన్నారని, సంబంధిత అధికారులను కలసి తన ఇబ్బంది గురించి మాట్లాడలేదని అన్నారు. దమ్మాలపాటి శ్రీనివాస్ వినిపించిన వాదనను హైకోర్టు తప్పుపట్టింది. అంతే కాదు ఏపీలో అధికారులు వ్యవహరిస్తున్నతీరుపై కూడా తీవ్రమైన వ్యాఖ్యలే చేసింది. ఎపి లో అధికారులు అన్యాయంగా వ్యవహరిస్తున్నారని, వేధింపులకు సైతం వెనుకాడడం లేదని న్యాయమూర్తి రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

   ఇలాగైతే పెట్టుబడులు రావు...

  ఇలాగైతే పెట్టుబడులు రావు...

  ఎజి వాదనపై న్యాయమూర్తి స్పందిస్తూ అనుమతుల కోసం అధికారులను అడుక్కోవాలా? అని ప్రశ్నించారు. ఈ కోర్టులో ఓ రోజు మీరు కూర్చోండి. అధికారులు ఏం చేస్తున్నారో మీకు తెలుస్తుంది. ఎంత అన్యాయంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతుంది. వేధింపులకు సైతం అధికారులు వెనుకాడటం లేదు. ప్రభుత్వం విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తుంది. ఇక్కడ ఉన్న కంపెనీలు, పరిశ్రమల గురించి మాత్రం పట్టించుకోదు. పెట్టుబడులు ఊరికే వస్తాయా? అందుకు అనువైన వాతావరణం ఉండాలి కదా.. ప్రస్తుతం ఉన్న వాతావరణం ఇలాగే కొనసాగితే ఒక్క కంపెనీ కూడా రాష్ట్రానికి రాదు. నేను ఈ విషయాలను చాలా బాధతో చెబుతున్నా.. మీరైనా ప్రభుత్వాన్ని గైడ్‌ చేయండి. కలెక్టర్‌ ఆదేశిస్తే తహసీల్దార్‌ చేయరా? ఇదేనా పాలన? దేవుడు వరమిచ్చినా పూజారి పట్టించుకోలేదంటే ఇదే. ఇలాగైతే రాష్ట్రానికి ఎవరొస్తారు?' అంటూ న్యాయమూర్తి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

  హైకోర్టు ఆదేశం...

  హైకోర్టు ఆదేశం...

  రెవిన్యూ రికార్డుల్లో మార్పు చేయనందువల్లే కంపెనీకి రుణం రాలేదు. రుణం రాలేదని భూమిని ఖాళీగా ఉంచితే తిరిగి స్వాధీనం చేసుకుంటారా? వారికి రుణం రాకపోవడానికి పరోక్షంగా ప్రభుత్వమే కారణమైన నేపథ్యంలో భూములు వెనక్కి తీసుకోవడం సమంజసం కాదు. ఎస్కో కంపెని కి భూములు తిరిగి స్వాధీనం చెయ్యాలని హై కోర్టు ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది.

   ఎపి ప్రభుత్వం ఏం చెయ్యాలి...

  ఎపి ప్రభుత్వం ఏం చెయ్యాలి...

  హై కోర్టు వ్యాఖ్యలు ఎపి ప్రభుత్వం పాలనను తీవ్రంగా తప్పుబడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టాలని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు. ఎపి ప్రభుత్వంపై హైకోర్టు విమర్శలు చేసినా నిజానికి ఈ పరిస్థితి తలెత్తడానికి కారణం అధికారుల వ్యవహారశైలే అనే విషయం గమనించాల్సి ఉందన్నారు. అంతేకాదు అధికారుల వైఖరితో విసిగిపోయిన కొన్ని సందర్భాల్లో సామాన్య ప్రజలు మాట్లాడుతున్నమాటలు హైకోర్టు వ్యాఖ్యల్లో ప్రతిఫలిస్తున్నాయని వారు అంటున్నారు. ఏదేమైనా హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో అధికారుల అలక్ష్యమైనా, నిర్లక్ష్యమైనా ప్రభుత్వం ఏమాత్రం ఉపేక్షించరాదని వారంటున్నారు. ఎంత కఠినంగా వ్యవహరించైనా సరే అధికారుల పనీతీరులో మార్పు వచ్చేలా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని, లేనిపక్షంలో ప్రభుత్వం ప్రతిష్ట ముందు ముందు మరింత దెబ్బతినే అవకాశం ఉంటుందని విశ్లేషిస్తున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  High Court has made Sensational Comments Over the ap government administration.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి