ఏపీలో మండుతున్న ఎండలు: 4 నుంచి పాఠశాలలు ఒంటిపూటే, 27 నుంచి పది పరీక్షలు
అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కంటే 4-5 డిగ్రీలు ఎక్కువగానే నమోదవుతున్నాయి. ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఒంటిపూట బడులను ప్రారంభించింది. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఉదయం 11.30 గంటల వరకే పాఠశాలలు కొనసాగుతున్నాయి.
ఎండలు తీవ్రం కావడంతో ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఒంటిపూట బడులు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విపరీతంగా పెరుగుతోన్న ఉష్ణోగ్రతలను పరిగణలోకి తీసుకున్న సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 4 నంచి రాష్ట్రంలో ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.

వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల ఆరోగ్య భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఉదయం 7.30 నుంచి 11.30 వరకు పాఠశాలల నిర్వహణ ఉంటుందని వెల్లడించారు.
ఇక విద్యార్థులకు ఏప్రిల్ 27 నుంచి 10వ తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. మే 6 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. కరోనా ప్రభావం తగ్గినప్పటికీ పదో తరగతి, ఇంటర్ పరీక్షలను కరోనా నియమ నిబంధనాలను పాటిస్తూనే నిర్వహిస్తామని మంత్రి తెలిపారు.
మరోవైపు, ఏపీలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైనే నమోదవుతున్నాయి. మార్చి నెలాఖరుకే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. విజయనగరం జిల్లాలోని పలు ప్రాంతాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. మధ్యాహ్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించింది. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఎండ తీవ్రత అధికంగా ఉంది. కాగా, బలమైన సముద్ర గాలుల వల్ల కోస్తాంధ్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications