తిరుమలలో కుండపోత: తిరుపతి సహా పలుచోట్ల..!!
తిరుమలలో ఈ సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉరుములు, మెరుపులతో వర్షం పడింది.
అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవ్వాళ కూడా భారీ వర్షం కురిసింది. పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. ఏపీలో రాయలసీమ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు విస్తారంగా కురిశాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మరో 48 గంటల పాటు ఇదే పరిస్థితి ఉండొచ్చని అమరావతిలోని భారత వాతావరణం కేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ విపత్తు నిర్వహణ విభాగం సూచించింది.

మరింత విస్తరణ..
తమిళనాడు ఉత్తర ప్రాంతం నుంచి కర్ణాటక మీదుగా కొంకణ్ తీరం వరకూ అల్పపీడన ద్రోణి ఏర్పడిన విషయం తెలిసిందే. సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తున ఉన్న ఈ ద్రోణి ఇవ్వాళ మరింత విస్తరించింది. దీని ప్రభావంతో ఇప్పటికే రెండు రోజులుగా పలుచోట్ల వర్షాలు కురిశాయి. ఏపీతో పాటు కర్ణాటక, తమిళనాడుల్లోని అనేక ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదైంది. రాయలసీమ జిల్లాలపై ఇవ్వాళ కూడా ద్రోణి ప్రభావం కనిపించింది.

తిరుపతి సహా..
అనంతపురం, తిరుపతి, చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో మరో మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఇదివరకు వెల్లడించిన విషయం తెలిసిందే. కొన్ని చోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఈ జిల్లాల్లో..
శనివారం నాడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఆదివారం కూడా అదే పరిస్థితి ఉంటుందని వివరించారు.

తిరుమలలో కుండపోతగా..
కాగా- ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో ఈ సాయంత్రం కుండపోతగా వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. సాయంత్రం వరకు సాధారణ స్థితిలో కనిపించిన వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దట్టమైన మేఘాలు అలముకున్నాయి. కొద్దిసేపటికే ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. శ్రీవారి ప్రధాన ఆలయం ఎదురుగా ఉన్న దుకాణాల్లో వర్షపునీరు ప్రవేశించింది. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు కొంత ఇబ్బందులకు గురయ్యారు.












Click it and Unblock the Notifications