ప్రపంచ స్థాయిలో తెలుగు అమ్మాయి అద్భుతం.. అంధ విద్యార్థుల కోసం వినూత్న ఆవిష్కరణ
ఏపీలోని భీమవరంలో ఉన్న శ్రీ విష్ణు ఇంజినీరింగ్ కాలేజీ ఫర్ ఉమెన్ లో ఇంజినీరింగ్ చదువుతున్న 20 ఏళ్ల లింగంపల్లి హిమజ ప్రతిష్టాత్మక జేమ్స్ డైసన్ అవార్డు-2026 కు ఎంపికయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఈ అవార్డు కోసం షార్ట్ లిస్ట్ చేసిన 20 మందిలో ఆమె చోటు సంపాదించారు. దృష్టి లోపం ఉన్న విద్యార్థులు ఎవరిమీదా ఆధారపడకుండా సొంతంగా డాక్యుమెంట్స్ ను తయారు చేసుకోవడం కోసం రుద్ర అనే వాయిస్ ఎనేబుల్డ్ బ్రెయిలీ ప్రింటర్ ను ఆమె రూపొందించారు. దాంతో ఆమె ప్రపంచవ్యాప్తంగా జేమ్స్ డైసన్ అవార్డును షార్ట్ లిస్ట్ అయిన 20 మందిలో ఒకరిగా నిలిచారు. రుద్ర వాయిస్ ఎనేబుల్డ్ బ్రెయిలీ ప్రింటర్ ద్వారా దృష్టి లోపం ఉన్న విద్యార్థులకు మంచి ఉపయోగకరంగా ఉంటుందని హిమజ స్పష్టం చేశారు.
హిమజ స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం. ఆమె తల్లిదండ్రులు లింగంపల్లి కిషోర్ కుమార్, వాణి. హిమజ ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని విష్ణు మహిళా యూనివర్సిటీలో బీటెక్ ఈఈఈ నాలుగో సంవత్సరం చదువుతున్నారు. ఇక హిమజ అభివృద్ధి చేసిన రుద్ర బ్రెయిలీ ప్రింటర్ ను బ్రిటిష్ ఇన్వెంటర్ అండ్ ఇండస్ట్రీయలిస్ట్ సర్ జేమ్స్ డైసన్ వ్యక్తిగతంగా రివ్యూ చేయనున్నారు. ఈ మేరకు విజేతలను నవంబర్ 4 న ప్రకటించనున్నారు. అలాగే విజేతలకు 30 వేల యూరోలు అనగా మన దేశ కరెన్సీలో 38 లక్షలకు పైగా నగదు దక్కనుంది. ఆ నగదును ప్రొడక్ట్ రిఫైన్ మెంట్, కమర్షియలైజేషన్ కోసం అందించనున్నారు.
ఇక హిమజకు ఈ ఆలోచన రెండేళ్ల క్రితం పుట్టింది. ఓ సారి ఆమె యూవీ సుబ్బరాజు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడిచే ఓ అంధ విద్యార్థుల స్కూల్ ను సందర్శించారు. అయితే ఆ సమయంలో ఓ విద్యార్థిని స్టైలస్ సాయంతో బ్రెయిలీ లిపిని రాయడంలో ఇబ్బందులు పడుతూ కనిపించింది. ఇలా కాకుండా వాయిస్ కమాండ్ తో ప్రింటర్ పనిచేస్తే బాగుంటుందన్న విద్యార్థి సూచనను పరిగణలోకి తీసుకున్న హిమజ ఈమేరకు ప్రయత్నాలను ప్రారంభించింది. ఈ మేరకు ప్రొఫెసర్ జొన్నల రోహిత్ బాలాజీ అందించిన సలహాలు.. సూచనలతో సరికొత్త ఆవిష్కరణకు ప్రాణం పోసింది. అలెక్సా అనుసంధానంతో వాయిస్ ఓవర్ బ్రెయిలీ ప్రింటర్ సిస్టమ్ ను తయారు చేశారు. దీనికి రుద్ర అనే పేరు పెట్టారు.

ఇక ఈ ఘనత సాధించడంపై హిమజ హర్షం వ్యక్తం చేశారు. రుద్ర బ్రెయిలీ ప్రింటర్ సిస్టమ్ కు అంతర్జాతీయ గుర్తింపు దక్కడం ఓ మరచిపోలేని గుర్తింపు అని తెలిపారు. రుద్ర ను మరింత పటిష్టంగా.. అడ్వాన్స్ లెవెల్ లో తీర్చిదిద్దడంలో తన ప్రయత్నానికి ఈ గుర్తింపు మరి ఉత్సాహాన్ని ఇచ్చిందని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications
