ఆందోళనలకు బ్రేక్ ఇచ్చిన అభిజిత్ దిప్కే: బిగ్ స్టేట్‌మెంట్
కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే బిగ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలకు తాత్కాలికంగా విరామం ప్రకటించారు. ఈ మేరకు కాక్రోచ్ జనతా పార్టీ సభ్యులు, నేహా బోరా, ఇతర ఆందోళనకారులను ఉద్దేశించి ఓ వీడియో విడుదల చేశారు. వివిధ అంశాలపై ఉద్యమాలను నిర్వహిస్తూ వస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో హఠాత్తుగా వాటికి విరామం ఇవ్వడం చర్చనీయాంశమౌతోంది.
రాబోయే దీపావళి పండుగ వరకు ఎటువంటి నిరసన కార్యక్రమాలు చేపట్టబోమని అభిజిత్ దిప్కే ఈ వీడియో ద్వారా అధికారికంగా ప్రకటించారు. పండగ సమయంలో పార్టీ మద్దతుదారులు అందరూ తమ కుటుంబ సభ్యులతో గడపాలని విజ్ఞప్తి చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో నమోదైన సంఘటనల వల్ల కార్యకర్తల కుటుంబాల్లో భయాందోళనలు నెలకొన్నాయని, ఈ సమయంలో పండగను ఆత్మీయులతో జరుపుకోవడం ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతానికి ఆయా ఆందోళనల కంటే కూడా కుటుంబానికి, మానసిక ప్రశాంతత ప్రాధాన్యత ఇవ్వాలని అభిజీత్ దిప్కే విజ్ఞప్తి చేశారు. దీపావళి వరకు కాక్రోచ్ జనత పార్టీ మద్దతుదారులందరూ కుటుంబ సభ్యులతో గడపాలని కోరుతున్నానని అన్నారు. పండుగలు సమయంలో కొద్దిరోజుల పాటు మీ కుటుంబ సభ్యులు, ఆత్మీయులకు పూర్తి సమయం ఇవ్వాలని అన్నారు. దీపావళి ముగిసే వరకు కూడా ఎలాంటి బహిరంగ నిరసనలు, ధర్నాలు, పికేటింగ్‌లు నిర్వహించబోమని ఆయన తేల్చి చెప్పారు.
పండుగల సీజన్ పూర్తయిన తర్వాత పరిస్థితిని పునఃసమీక్షించి, మలి విడత ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని అభిజిత్ దిప్కే పేర్కొన్నారు. తమ పార్టీ నేతలను జైలులో ఉంచడానికి కేంద్ర ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోందని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. ప్రభుత్వ చర్యల వల్ల తమ నాయకులు ఏమాత్రం భయపడట్లేదని, జైలు శిక్ష విధించినప్పటికీ వారు మనోధైర్యంతో ఉన్నారని వివరించారు.
అయిదు రోజుల కస్టడీ ముగిసి కోర్టుకు హాజరైన సమయంలోనూ సౌరభ్ దాస్, అశుతోష్ రంకా చిరునవ్వుతో కనిపిస్తూ తన పట్టుదలను ప్రదర్శించారని దిప్కే కొనియాడారు. ఇదే తమ పార్టీకి నిజమైన బలమని దిప్కే వ్యాఖ్యానించారు. సౌరభ్ దాస్, అశుతోష్ రంకా తల్లిదండ్రులతో పాటు తన సొంత కుటుంబ సభ్యులు కూడా ఇటీవలి అరెస్టుల వల్ల ఆందోళన చెందుతున్నారని, ఈ పరిస్థితుల్లో కార్యకర్తలు ఇళ్లకు వెళ్లి కుటుంబాలకు అండగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. సౌరవ్ దాస్, అశుతోష్ రంకా ఇచ్చే ప్లాన్ నే తాను అనుసరిస్తుంటానని పేర్కొన్నారు.
Message to all cockroaches https://t.co/9e5yI9Nst0
— Abhijeet Dipke (@abhijeet_dipke) October 20, 2026
మొత్తం ఒక వ్యవస్థనే కదిలించడానికి ప్రయత్నిస్తోన్నామని, అదే వ్యవస్థ తమను అణచివేయడానికీ శతవిధాల యత్నిస్తోందని గుర్తు చేశారు. ఇంత జరిగిన ఏ ఒక్క కాక్రోచ్ కూడా భయపడకుండా, రెట్టింపు ఉత్సాహంతో తమతో కలిసివస్తోన్నారని, వారికి సెల్యూట్ చేస్తోన్నానని దిప్కే అన్నారు. నేపాల్, బంగ్లాదేశ్, ఫ్రాన్స్ అల్లర్లతో కాక్రోచ్ జనత పార్టీ ఉద్యమాన్ని పోల్చడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏ ఒక్క కాక్రోచ్ కూడా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేయలేదని గుర్తు చేశారు. పైగా చిరునవ్వుతో జైలుకు వెళ్లారని అన్నారు.














Click it and Unblock the Notifications
