హైదరాబాద్‌లో ఇందిరమ్మ టవర్స్ రెండో విడత లాటరీ.. ఎప్పుడో తెలుసా!
హైదరాబాద్‌లో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ రెండోవిడత లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి నిరీక్షణ కొనసాగుతోంది. ఎల్బీనగర్, గోషామహల్, ముషీరాబాద్, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాల్లో ఫ్లాట్ల కేటాయింపుకు సంబంధించి దరఖాస్తుల పరిశీలన జరుగుతోంది. పండగ తర్వాత వారంలో లాటరీ నిర్వహించే అవకాశం ఉందని సమాచారం.
ప్రభుత్వం ఈ నాలుగు నియోజకవర్గాల్లో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి స్థలాలను గుర్తించింది. ఎల్బీనగర్‌కు హయత్‌నగర్ గ్రామంలో, గోషామహల్‌కు నాంపల్లిలో, ముషీరాబాద్‌కు జమిస్థాపూర్‌లోని ఆర్టీసీ క్వార్టర్స్ ప్రాంతంలో, చాంద్రాయణగుట్టకు ఫలక్‌నుమా సమీపంలోని బండ్లగూడలో స్థలాలు ఎంపికయ్యాయి. ఆగస్టులో డిమాండ్ సర్వే పేరుతో దరఖాస్తులు ఆహ్వానించి, సెప్టెంబర్ 10 వరకు స్వీకరించారు.

తొలి విడతతో పోలిస్తే ఈ నాలుగు ప్రాంతాల్లో దరఖాస్తుదారుల స్పందన కాస్త తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దరఖాస్తుల పరిశీలనలో అధికారులు 360 డిగ్రీల విధానంలో వడపోత చేపట్టారు. అర్హతలు, సమర్పించిన వివరాలను పరిశీలిస్తూ వ్యక్తిగతంగా సందేశాల ద్వారా స్థితిగతులు తెలియజేస్తున్నారు. కొన్ని దరఖాస్తులు తిరస్కరణకు గురైతే కారణాలు చెబుతూ వివరణలు కోరుతున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతనే తుది లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది.
పండగ తర్వాత వారంలోనే ఈ నాలుగు నియోజకవర్గాలకు సంబంధించిన లాటరీ నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. లాటరీ అనంతరం అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరించి క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేపట్టనున్నారు. దసరా తర్వాత అర్హులైన లబ్ధిదారుల ఎంపికపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే లాటరీ తేదీపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.
మరోవైపు తొలి విడతలో ఎంపికైన లబ్ధిదారుల్లో 80 శాతానికి పైగా మంది తొలి చెల్లింపు కింద రూ.లక్ష చెల్లించారు.
కొన్ని నియోజకవర్గాల్లో నిర్మించనున్న ఫ్లాట్ల సంఖ్యకు సరిపడా లబ్ధిదారులు ఎంపిక కాకపోవడంతో, అర్హులుగా తేలిన వారితో మళ్లీ లాటరీ నిర్వహించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎంపికైన వారి సంఖ్య తక్కువగా ఉండటం గమనార్హం. ఇందిరమ్మ టవర్స్ పథకం పేదలకు సొంత ఇల్లు కల్పించే దిశగా ప్రభుత్వం చేపట్టిన ముఖ్య కార్యక్రమం.
ఫ్లాట్లు సుమారు రూ.4 లక్షల ఖర్చుతో లబ్ధిదారులకు అందించనున్నారు. రెండో విడత లబ్ధిదారుల ఎంపిక, తొలి విడతలో మిగిలిన ఖాళీల భర్తీ, ఫిర్యాదుల పరిష్కారం పూర్తయితే కేటాయింపులపై మరింత స్పష్టత వస్తుంది. దరఖాస్తు చేసిన వారు త్వరలోనే లాటరీ తేదీ ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు.












Click it and Unblock the Notifications
