బాలకృష్ణ కొడతారని మంత్రులు భయపడ్డారా, చూస్తే అర్థమౌతోంది సీఎంగా చేయండి: అంబటి
అమరావతి: గవర్నర్ నరసింహన్‌పై, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు గురువారం తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన గవర్నర్ ముఖ్యమంత్రి చంద్రబాబు భజన చేయడం సరికాదన్నారు.
Recommended Video

గవర్నర్ తీరును తాము ఖండిస్తున్నామని చెప్పారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన గవర్నరే భజన చేస్తుంటే ఎలా అన్నారు. గవర్నర్‌ను మార్చాలని బీజేపీ పార్లమెంటు సభ్యులు కూడా డిమాండ్ చేశారని, కానీ అది అమలు కాలేదన్నారు. గవర్నర్ టీడీపీ ప్రచార కమిటీ అధ్యక్షుడిగా మారారని చెప్పారు.

వెంకయ్య నాయుడు కూడా చెప్పారు
పార్టీ ఫిరాయించిన ఇరవై మందికి పైగా ఎమ్మెల్యేలు రాజీనామా చేయకుంటే తాము అసెంబ్లీకి రామని చెప్పామని అంబటి రాంబాబు అన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా పార్టీ ఫిరాయింపులను ఖండించారని అన్నారు. పార్టీ ఫిరాయింపులు సరికాదని ఆయన అభిప్రాయపడ్డారని చెప్పారు.

బీజేపీ కూడా టీడీపీని ఎండగడుతోంది
మిత్రపక్షమైన బీజేపీ కూడా తెలుగుదేశం పార్టీని ఎండగడుతోందని అంబటి అన్నారు. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఫిరాయింపులను ప్రోత్సహించడం సరికాదని అన్నారు. సీఎం కుర్చీలో కూర్చొని చంద్రబాబు అపహాస్యం చేస్తున్నారన్నారు.

బీజేపీ - టీడీపీ మధ్య సఖ్యత లేదు
బీజేపీ, తెలుగుదేశం పార్టీ మధ్య ఏమాత్రం సఖ్యత లేదని అంబటి రాంబాబు అన్నారు. ప్రత్యేక హోదా కోసం ఎవరికైనా తాము మద్దతు ఇస్తామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో సింగిల్‌గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సత్తా జగన్‌కు, వైసీపీకి ఉందని తేల్చి చెప్పారు. తద్వారా బీజేపీ అవసరం లేదని అభిప్రాయపడ్డారు.

బాలకృష్ణను చూస్తే అర్థమవుతుంది
ముఖ్యమంత్రి కుర్చీని ఎమ్మెల్యే బాలకృష్ణ అవమానించడం సరికాదని, ప్రజాస్వామ్యంలో సంప్రదాయాలను గౌరవించాలని అంబటి అన్నారు. బాలకృష్ణ తీరు చూస్తుంటే ఏపీలో పాలన ఎలా ఉందో అర్థమవుతోందన్నారు. పక్కన ఉండి కూడా బాలకృష్ణను మంత్రులు, అధికారులు ఎందుకు ప్రశ్నించలేదన్నారు.

బాలకృష్ణను సీఎం చేస్తే అభ్యంతరం లేదు
అక్కడ కూర్చోవద్దని బాలకృష్ణకు చెబితే ఆయన కొడతారని అధికారులు, మంత్రులు చెప్పలేదా అని అంబటి ఎద్దేవా చేశారు. కొందరు టీడీపీ నేతలు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారన్నారు. నిన్నటి వరకు లోకేష్ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించారని, ఆయన దొడ్డదారిన సీఎం అయ్యారని, ఇప్పుడు బావమరిది అవుతున్నారన్నారు. బావమరిది మీద ప్రేమ ఉంటే చంద్రబాబు వెంటనే తప్పుకొని బాలకృష్ణను సీఎం చేస్తే అభ్యంతరం లేదన్నారు.












Click it and Unblock the Notifications