TTD: టీటీడీ ఉద్యోగులకు ఇళ్లస్థలాలు: పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు!!
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం ముగిసింది. ఈరోజు జరిగిన టిటిడి సమావేశంలో నిర్ణయాలను తీసుకున్నారు టిటిడి ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు, వేతనాల పెంపుపై శుభవార్తను అందించారు. ఈ మేరకు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.
తిరుమలలోని అన్నమయ్య భవనంలో టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన పాలకమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై పాలకమండలి సమావేశం తర్వాత టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. టీటీడీ ఉద్యోగులకు ఈనెల 28న 3,518 మందికి ఇంటి పట్టాలు ఇవ్వాలని టీటీడీ పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

శానిటేషన్ ఉద్యోగులకు వేతనాలు పెంచనున్నట్లు ఆయన శుభవార్త చెప్పారు. ఫిబ్రవరిలో రెండు రోజులు పాటు దేశవ్యాప్తంగా పీఠాధిపతులను ఆహ్వానించి సదస్సు నిర్వహిస్తామని వెల్లడించారు. కల్యాణ కట్ట పీస్ రేట్ క్షురకులకు నెలకు 20 వేల వేతనం ఇవ్వనున్నట్టు వెల్లడించారు. పోటు కార్మికులకు 10వేల రూపాయల మేరకు జీతాలను పెంచుతున్నామన్నారు.
చిన్నజీయర్ , పెద్ద జీయర్ మఠాల నిర్వహణ, ఉద్యోగుల ఉద్యోగ భద్రత కోసం అదనంగా ఏటా కోటి రూపాయల సహాయం అందజేస్తామని చెప్పారు. అలాగే డిసెంబరు 28వ తేదీ నుంచి ఉద్యోగులకు ఇంటి స్థలాలను పంపిణీ చేస్తామన్నారు. టిటిడి ఉద్యోగుల ఇళ్ల స్థలాల కోసం మరో 350 ఎకరాల భూమి కొనుగోలు చేస్తున్నట్టుగా కూడా ఆయన చెప్పారు.
తిరుపతి నగరం సర్వతోముఖాభివృద్ధి చెందాలని భావిస్తున్నామని, తిరుపతి అభివృద్ధి, పారిశుధ్య నిర్వహణ చూసి ఇతర ప్రాంతాల వారు గొప్పగా చెప్పుకోవాలి అనేలా కృషి చేస్తున్నామన్నారు. తమ ప్రయత్నాలను అడ్డుకుంటున్న దుష్ట శక్తులకు బుద్ధి చెప్పి, తమకు టీటీడీ ఉద్యోగులు, తిరుపతి ప్రజలు అండగా ఉండి మద్దతు తెలిపి కృతజ్ఞత చూపాల్సిన అవసరం ఉందన్నారు.












Click it and Unblock the Notifications